చింతలమానెపల్లి(సిర్పూర్):
దివ్యాంగులపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. సదరమ్ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీరిని చూస్తే సామాన్యులకు సైతం ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది. కానీ దివ్యాంగుల పట్ల అధికారులకు మాత్రం కనికరం కలగడం లేదు. ఫలితంగా ధ్రువీకరణ పత్రాలు లేక దివ్యాంగులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఓటరుగా కూడా తమ హక్కులు కోల్పోతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో సుమారు 14వేల మందిపైగా దివ్యాంగులు ఉన్నారు. కానీ ఇందులో 7,070 మంది మాత్రమే దివ్యాంగులుగా ధ్రువీకరణ పత్రాలు పొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 5 ఏళ్లలో మంచిర్యాలలో శిబిరాలు నిర్వహించారు. కాగజ్‌నగర్‌లో ఒకసారి శిబిరం నిర్వహించి గుర్తింపు పత్రాలు అందజేశారు. కొత్తగా కుమురంభీం జిల్లా ఏర్పడ్డ తొలుతలో ఒకసారి జిల్లా కేంద్రంలో సదరమ్ శిబిరం నిర్వహించగా సుమారు 3వేల మంది హాజరయ్యారు. కానీ ఇందులో ఇప్పటి వరకు ఒక్కరికీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో దివ్యాంగుల సంఖ్య అధికంగా ఉన్నా సదరమ్ శిబిరాలు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలకు దూరం
దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సదరమ్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఈ సర్టిఫికెట్ లేక దివ్యాంగులు పథకాలకు అర్హత కోల్పోతున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు, ఆర్థిక పథకాలు వీరికి అందడం లేదు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పింఛన్, ఆర్టీసీ, రైల్వే ప్రయాణాల్లో రాయితీ, సబ్సిడీ రుణాల మంజూరు, ట్రై సైకిళ్ల మంజూరు, చేతికర్రలు సహా మరికొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ధ్రువీకరణ పత్రాలు లేక ఈ పథకాలకు దివ్యాంగులు దూరం కావాల్సి వస్తోంది.
మండల కేంద్రాల్లో శిబిరాలు నిర్వహించాలి
జిల్లాలో దివ్యాంగులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో చాలా మందికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల్లో అర్హత కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మండల కేంద్రాల్లోనే సదరమ్ శిబిరాలను నిర్వహించాలని దివ్యాంగులు కోరుతున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి పట్టణాలకు వెళ్లాలంటే బెజ్జూర్, కౌటాల, దహెగాం, చింతలమానెపల్లి మండలాలలోని మారుమూల గ్రామాల నుంచి సుమారు 100నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇంత దూర ప్రాంతాలకు దివ్యాంగులు వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి సమస్యలపై గతంలో జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో ఆందోళనలు కూడా నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రాలూ అందించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో దివ్యాంగులు మానసికంగా వేదనకు గురవుతున్నారు.
ఎన్నికల పోలింగ్‌లో ధ్రువీకరణ పత్రం ఉంటేనే గుర్తింపు..
ఎన్నికల పోలింగ్‌లో భాగంగా దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రం ఉంటేనే దివ్యాంగులకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ఓటు వేసే సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
- దివ్యాంగులు పోలింగ్ గదిలోకి వెళ్లేందుకు వీలుగా మెట్లు ఉన్న ప్రాంతంలో ర్యాంప్ నిర్మించాలి.
- దివ్యాంగుల కోసం చక్రాల కుర్చిలు ఏర్పాటు చేసి తరలించాలి. ఇందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే కుర్చిలు కొనుగోలు చేసింది.
- ఆయా పోలింగ్ కేంద్రం పరిధిలో దివ్యాంగుల సంఖ్య అధికంగా ఉంటే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.దివ్యాంగులు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేంత వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాల్సి ఉంటుంది.
- ఇంటి నుంచి బయటకు రాలేని దివ్యాంగులను ప్రభుత్వ అధికారులు గుర్తించి పోలింగ్ కేంద్రం వరకు తరలించి ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటారు. కొంతవరకు దివ్యాంగులకు మానవతా దృక్పథంతో సహకరిస్తున్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం అందించే సౌకర్యాలకు మాత్రం దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా అధికారులకు చూపించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment