
డీఎస్పీకి మెసేజ్ పెట్టి...ఎలుకల మందు తాగాడు
గోదావరిఖని: ప్రేమ వ్యవహారంలో తనకు న్యాయం చేయలేదంటూ ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చనిపోతున్నానంటూ డీఎస్పీకి ఫోన్లో మెసేజ్ పెట్టి మరీ ఎలుకల మందు తాగాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గోదావరిఖనికి చెందిన ఎంసీఏ విద్యార్థి మేడిమెళ్ల ప్రసాద్ ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం సదరు విద్యార్థి తల్లిదండ్రులకు తెలిసింది.
దీంతో ఆమెను కాలేజీ మానిపించి ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా కట్టడి చేశారు. తన ప్రియురాలను గృహ నిర్బంధం చేశారని ప్రేమికుడు ప్రసాద్ గతంలో పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని, తనకు న్యాయం జరగలేదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని డీఎస్పీకి ఎస్‌ఎంఎస్ చేశాడు. దాంతో పోలీసులు వెంటనే స్పందించి... ప్రసాద్ నివాసానికి చేరుకుని... అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.