
ఖమ్మం క్రైం: మరో మూడు గంటల్లో డిశ్చార్జి కావాల్సిన ఆమె ఒక్కసారిగా ఆస్పత్రి భవనంపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఖమ్మంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ జహీర్‌పుర తండాకు చెందిన డుంగ్రోతు రాంబాబు రిక్షా పుల్లర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉపేంద్రమ్మ(20) కాగా..ఆమె డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. మూడు రోజులక్రితం కడపునొప్పితో పాటు, ఫిట్స్ రావడంతో ఎన్నెస్టీ రోడ్డులోని క్యూర్ ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స అనంతరం ఉపేంద్రమ్మ కోలుకున్నాక మంగళవారం కొన్ని గంటల్లో డిశ్చార్జ్ కావాల్సి ఉండగా..బాత్రూంలోకి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో..తల్లి నాగమ్మ మందలించింది. మనస్తాపానికి గురైన ఆమె..బయటకు వచ్చి పరుగెత్తుకుంటూ ఆస్పత్రి భవనంపైకి వెళ్లి..కిందకి దూకింది. ఆ తర్వాత ఐసీయూకు తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయింది. అయితే..కిందకు దూకాక బతికే ఉన్నా..సదరు ఆస్పత్రి వారు పట్టించుకోలేదని, వైద్యం చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగగా టూటౌన్ సీఐ రాజిరెడ్డి అధ్వర్యంలో ఎస్సైలు కృష్ణ, రామారావు, సిబ్బంది అక్కడికి చేరుకొని..పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment