సాక్షి, ఖమ్మం: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నిరుపేద విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. గత విద్యా సంవత్సరం బకాయిలు ఇంకా విడుదల కాకపోవడంతో వారి చదువులు సందిగ్ధంలో పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా రూ.63 కోట్ల బకాయిలు పేరుకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుందో, లేదోననే ఆందోళనలో ఉన్నాయి. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగిడినా నేటికీ రీయింబర్స్‌మెంట్ కాక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ అవుతుంది.
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ పథకం ఆసరాగా నిలుస్తోంది. గత ఏడాదిలో ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులు లక్ష మందికి పైగా ఈ పథకానికి అర్హులు కాగా, ఇంకా 39,548 మంది విద్యార్థులకు రూ.63 కోట్లు ఫీజు రీయింబర్స్ కాలేదు. ఇందులో బీసీ విద్యార్థులు 11,970 మంది, ఈబీసీ 3,578, ఎస్సీ 6 వేలు, ఎస్టీ విద్యార్థులు 18 వేల మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిసే లోపే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కావాలి.
కానీ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా కొత్త ప్రభుత్వం ఇంకా ఈ పథకం విధివిధానాలను ఖరారు చేయలేదు. దీంతో తమకు ఫీజు రీయింబర్స్ వస్తుందో..? లేదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఫైనలియర్ పూర్తి చేసిన విద్యార్థులు ప్లేస్‌మెంట్ ద్వారా ఉద్యోగాలకు వెళ్లినా, ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హత పత్రాలు తీసుకోవాలన్నా ముందుగా ఫీజు చెల్లించాలని యాజమన్యాలు ఆయా విద్యార్థులకు సూచిస్తున్నాయి.
ఫీజు కడితేనే అర్హత పత్రాలు ఇస్తామని చెబుతుండడంతో ఇటు ఫీజు రీయింబర్స్ రాక, అటు బయట అంత డబ్బు అప్పు తేలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలానే ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు కొంతమంది విద్యార్థులకు అర్హత లేదని ఫీజు విడుదల చేయకపోవడంతో వారు మధ్యలోనే చదువు నిలిపివేయాల్సి వచ్చింది.
ఎస్టీ విద్యార్థులే అధికం..
జిల్లాలో ఫీజు రీయింబర్స్ కాని విద్యార్థులు ఎక్కువగా ఎస్టీలే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 18వేల మందికి రూ.25 కోట్లు రీయింబర్స్ కావాలి. ఇందులో ఏజె న్సీ విద్యార్థులే అత్యధికం. అయితే ఈ పథకం కల్పించిన అవకాశంతో మారుమూలన ఉన్న ఎస్టీ విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో చేరి అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేయకపోతే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల చుట్టూ తిరిగితే త్వరలో వస్తాయని చెపుతున్నారే తప్ప.. ఖచ్చితమైన సమయం చెప్పడం లేదని, యాజమాన్యాలు మాత్రం తమను ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సుల్లో చేరడానికి అర్హత పరీక్ష రాశారు. త్వరలో ఈ అడ్మిష న్లు ప్రారంభం కానున్నాయి. అయితే కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఫీజు పెం డింగ్‌లో ఉందని యాజమాన్యాలు చెబుతుండడంతో అప్పటి వరకు రీయిం బ ర్స్ కాకపోతే ఈ కోర్సుల్లో అడ్మిషన్ పొందలేమని ఆందోళన చెందుతున్నారు.
నూతనం విధానం ఎప్పుడు..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, నూతనంగా ప్రభుత్వం కొలువుదీరడంతో.. రాష్ర్ట విద్యార్థులకే ఫీజు పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెబుతున్నా మరోవైపు అడ్మిషన్ల సమయం సమీపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ అభ్యసిస్తున్న విద్యార్థులు జిల్లాలో కొంతమంది మాత్రమే ఉన్నట్లు సంక్షేమ శాఖల అధికారులు పేర్కొంటున్నారు.
1956కు ముందు విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాాణలో నివాసం ఉన్నట్లయితే ఆయా విద్యార్థులకే ఫీజు వర్తింపజేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది అమలైనా ఈ కేటగిరిలో జిల్లాలో కేవలం కొంతమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మిగతా అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు విడుదలవుతుందని అధికారులు పేర్కొంటున్నా విద్యార్థులు మాత్రం ఫీజు డబ్బుల కోసం వేయి కళ్లతో ఎదరుచూస్తున్నారు.
ఎదురు చూపులే..
Published Wed, Jul 9 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement
Advertisement