తెలంగాణ 'టాస్క్‌' సూపర్‌ సక్సెస్‌ | Students Did TASK course recruited | Sakshi
Sakshi News home page

జాబ్‌ 'టాస్క్‌' 60%

Published Wed, Oct 4 2017 12:46 AM | Last Updated on Wed, Oct 4 2017 10:49 PM

Students Did TASK course recruited

సాక్షి, హైదరాబాద్‌ : టాస్క్‌.. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ సంస్థ అంచనాలకు మించి ఫలితాలు సాధిస్తోంది! ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులతోపాటు నిరుద్యోగులకు 85 రకాల కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ అందిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక్కడి ‘ఫినిషింగ్‌ స్కూల్‌’ కోర్సులో శిక్షణ పొందిన ఇంజనీరింగ్‌ పట్టభద్రుల్లో 60 శాతానికి పైగా ఉద్యోగాలు పొందారు. ఇతర కోర్సుల్లో శిక్షణ పొందిన వారిలో సైతం 30 శాతానికి పైగా ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోగలిగారు.

విద్యా సంస్థలు–పరిశ్రమల మధ్య వారధిగా..
రాష్ట్రంలో 248 ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచి ఏటా 80 వేల నుంచి లక్ష మంది విద్యార్థులు చదువులు పూర్తిచేసుకొని బయటకు వస్తున్నారు. అయితే వారిలో 29 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. పారిశ్రామిక రంగ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం లేక 71 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలు గణనీయ అభివృద్ధి సాధిస్తూ ఏటా వేలాది సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నా.. ఇంజనీరింగ్‌ పట్టభద్రులు వాటిని అందుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో పారిశ్రామికరంగ అవసరాలకు తగ్గట్టుగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు రెండేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ను ఏర్పాటు చేసింది. విద్యాసంస్థలు, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇది వారధిగా పనిచేస్తోంది. ఇటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అటు పరిశ్రమలకు నైపుణ్యం గల మానవ వనరులను అందించడంలో సఫలీకృతమవుతోంది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ నైపుణ్యాభివృద్ధి సంస్థగా పేరు తెచ్చుకోవడంతో పాటు పలు పురస్కారాలను కూడా అందుకుంది.

నిపుణులు, అనుభవజ్ఞులతో శిక్షణ
సంప్రదాయ తరగతి గది శిక్షణ తరహాలో కాకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు టాస్క్‌ మూడంచెలుగా కోర్సు కాలాన్ని విభజించి శిక్షణ అందిస్తోంది. వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధికి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కోసం పర్సనల్‌ ఇంపాక్ట్‌ స్కిల్స్, టీం వర్క్‌కు కావాల్సిన నైపుణ్యాల కోసం ఆర్గనైజేషన్‌ ఇంపాక్ట్‌ స్కిల్స్, టెక్నికల్‌ స్కిల్‌ అనే పేరుతో కోర్సు కాలాన్ని మూడు భాగాలుగా విభజించి ఆయా రంగాల్లో నిపుణులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తోంది. పారిశ్రామిక సంస్థల్లో ఉన్నత స్థాయిలో పని చేసి పదవీ విరమణ పొందిన అనుభజ్ఞులైన నిపుణులతో కూడా శిక్షణ ఇప్పిస్తోంది. పరిశ్రమల అవసరాలకు కావాల్సిన స్కిల్స్‌ను నేర్పించడంలో ఈ విధానం విజయవంతమైందని టాస్క్‌ అధికారులు చెబుతున్నారు.

పారిశ్రామిక దిగ్గజాలతో ఒప్పందం
యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రపంచస్థాయి పారిశ్రామిక దిగ్గజాలతో టాస్క్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్, ఐబీఎం, శామ్‌సంగ్, ఆటోడెస్క్‌ వంటి దాదాపు 22 సంస్థలు యువతకు శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు టాస్క్‌ భాగస్వాములుగా పని చేస్తున్నాయి. తమ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి తమ సంస్థల్లోనే ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. టాస్క్‌ వద్ద నమోదైన ఇంజనీరింగ్‌ కళాశాల క్యాంపస్‌లోనే సంబంధిత కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ కల్పిస్తున్నారు.

ఫినిషింగ్‌ స్కూల్‌ సక్సెస్‌
ఇంజనీరింగ్‌ పూర్తి చేసి సరైన నైపుణ్యం లేక ఉద్యోగావకాశాలు అందుకోలేకపోతున్న యువత కోసం టాస్క్‌ నిర్వహిస్తున్న ఫినిషింగ్‌ స్కూల్‌ కోర్సు మంచి సక్సెస్‌ రేటు సాధించింది. 10–12 వారాల పాటు నిర్వహించే ఈ కోర్సులో 1,645 మంది ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వగా వారిలో 976 మంది ఉద్యోగాలు అందుకోగలిగారు. ఈ శిక్షణ పొందిన వారిలో ఇప్పటి వరకు 60 శాతం మంది ఉద్యోగాలు పొందగలిగారని, మిగిలిన వారికి సైతం ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని టాస్క్‌ వర్గాలు తెలిపాయి.

ఫీజులు తక్కువే
ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, పాలిటెక్నిక్‌ విద్యార్థుల కోసం టాస్క్‌ దాదాపు 85 రకాల టెక్నికల్, సాఫ్ట్‌స్కిల్‌ కోర్సులను నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఒకరోజు నుంచి 4 నెలల వ్యవధితో 45 రకాల కోర్సులను నిర్వహిస్తోంది. డిగ్రీ విద్యార్థులకు ఒకరోజు నుంచి 6 నెలల వ్యవధి గల 17 కోర్సులు, ఫార్మసీ విద్యార్థులకు 1–2 రోజుల వ్యవధితో 6 రకాల కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు 2 రోజుల నుంచి 200 గంటల వ్యవధి గల 7 కోర్సులు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఒకరోజు నుంచి 5 రోజుల వ్యవధి గల 9 రకాల కోర్సులను అందిస్తోంది. ప్రైవేటు ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లతో పోలిస్తే టాస్క్‌ అందిస్తున్న కోర్సుల ఫీజు చాలా తక్కువ. ప్రైవేటు కోచింగ్‌ సంస్థలు శాప్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సు శిక్షణ కోసం రూ.3.5 లక్షల ఫీజు వసూలు చేస్తుండగా.. టాస్క్‌ కేవలం రూ.12 వేలకే అందిస్తోంది.

ఉద్యోగాల కొరత లేదు: సుజీవ్‌ నాయర్, టాస్క్‌ సీఈవో
ఉద్యోగావకాశాలకు కొరత లేదు. ఉద్యోగాలు లేవని ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. నైపుణ్యాల కొరత ఉంది. నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement