విద్యార్థులు కలెక్టరేట్‌కు ర్యాలీ | Students Protest Against Their Hostel Facilities Mahabubnagar | Sakshi
Sakshi News home page

విద్యార్థులు కలెక్టరేట్‌కు ర్యాలీ

Published Tue, Aug 27 2019 11:42 AM | Last Updated on Tue, Aug 27 2019 11:45 AM

Students Protest Against Their Hostel Facilities Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: మా హాస్టల్‌లో భోజనం అస్సలు బాగుండదు సార్‌.. ఎట్లబడితే అట్ల వండుతున్నరు.. అన్నంలో పురుగులు వస్తుంటయ్‌.. కూరగాయలు నీళ్ల చారుకంటే పలుసగ ఉంటయి.. ఇట్లుంటే ఎట్ల తినాలే సార్‌.. అంటూ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులు సోమవారం కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో మొరపెట్టుకున్నారు. హాస్టల్‌ నుంచి నేరుగా ప్రజావాణి కేంద్రానికి చేరుకుని కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లలో వార్డెన్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని, నాణ్యమైన భోజనం, వసతులు కల్పించడం లేదని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించినా మార్పు రావడంలేదని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీరు, మెనూ  ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, హాస్టల్‌ పరిసరాలు శుభ్రంగా లేవని ఈ సమస్యలను మీరే పరిష్కరించాలని విన్నవించారు. స్పందించిన కలెక్టర్‌ వీలైనంత త్వరగా విచారణ చేయించి మీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతానని హామీనివ్వడంతో విద్యార్థులు శాంతించారు. 

అన్ని హాస్టళ్లలో ఇదే తంతూ..  
జిల్లాలో మొత్తం 5 కళాశాల స్థాయి హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో రెండు జడ్చర్లలో ఉండగా, మిగతావి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఉన్నాయి. రెండు బాలుర హాస్టళ్లు ఉండగా, మూడు బాలికల హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,650 మంది విద్యార్థులు చదువుతున్నారు. చాలా హాస్టళ్లలో విద్యార్థులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ కూడా మెనూ, నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదు. మరుగుదొడ్లు, గదులు, కిచెన్‌లు, డైనింగ్‌హాళ్ల వంటి వాటిలో పూర్తిగా శుభ్రత లోపించింది. అన్ని హాస్టళ్లు పాతవి కావడంతో తలుపులు, కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.  

విద్యార్థుల నిరసన 
సమస్యల గురించి వార్డెన్‌కు చెప్పినా పట్టిం చుకోవడంలేదని ఎస్సీ బాలుర హాస్టల్‌  విద్యార్థులు ఉదయం టిఫిన్‌ను బహిష్కరించి, జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్‌పల్లి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. దారిమధ్యలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారి యాదయ్య విద్యార్థులను సముదాయించేందుకు ప్రయత్నించినా విద్యార్థులు వినలేదు. హాస్టల్‌లో సమస్య ఉందని చెప్పినా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నారని, మెనూ విషయం అస్సలు పట్టించుకుకోవడంలేదని, బియ్యం బాలేదని, అన్నం వం డితే ముద్దలు ముద్దలుగా అవుతుందని, అది తిని పిల్లలు కడుపునొప్పితో బాధపడుతున్నారని అధికారితో వాగ్వాదం చేశారు. హాస్టల్‌లో కేవలం 250 మంది విద్యార్థులకు అడ్మీషన్లు ఇవ్వాల్సి ఉండగా 430 మంది విద్యార్థులు ఉంటున్నారని, మరుగుదొడ్లు, తాగునీరు, గదులు సరిపోవడం లేదని వార్డెన్‌ ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోక పోవడంతోనే కలెక్టర్‌ను కలవడానికి వెళ్తున్నామని తెలిపారు.  

ఫిర్యాదు చేసినా పట్టించుకోలే 
హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, గదులు లేవు. తాగునీరు, స్నానానికి నీళ్లు లేక ఎక్కడెక్కడికో వెళ్లి చేసి వస్తున్నం. హాస్టల్‌ ఆవరణ అంతా పందులే ఉంటాయి. ఈ విషయాన్ని వార్డెన్‌కు, ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలే. 
– తిరుపతయ్య, ఎంవీఎస్‌ కళాశాల విద్యార్థి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement