![Study on the formation of the Egg Board - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/26/Untitled-12.jpg.webp?itok=gt1hd9u8)
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించే ఎగ్ బోర్డును ఏర్పాటుచేసి, కోడి గుడ్ల ధరను నిర్ణయించడంలోని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో బ్రీడర్స్, హేచరీస్ రైతులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కోడిగుడ్ల ధరను నిర్ణయించడంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్‌ఈసీసీ) తీరుతో తాము నష్టపోతున్నామని కొందరు పౌల్ట్రీ రైతులు గురువారం మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 1,500 మంది లేయర్ పౌల్ట్రీ రైతులు ఉన్నారని, వీరికి గుడ్లు పెట్టే కోళ్లను సరఫరా చేసే బ్రీడర్ ఫార్మర్స్ వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో ఉన్నారు.
తెలంగాణలో రోజూ మూడు కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, రాష్ట్రంలోనే 70శాతం గుడ్లను వినియోగిస్తున్నారన్నారు. పెరిగిన దాణా ఖర్చుకు అనుగుణంగా గుడ్డు ధర పెరగక పోవడంతో లేయర్ పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారని తెలిపారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం మనుగడలో ఉన్న ఎగ్‌బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారని, ఎగ్‌బోర్డు ఏర్పాటు సాధ్యాసా«ధ్యాలపై అధ్యయనం చేసి, పౌల్ట్రీ రంగం నిలదొక్కుకునేందుకు చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా గుడ్డు ధరను నిర్ణయించడంలో ఎన్‌ఈసీసీ వైఫల్యంతో ఒక్కో గుడ్డుపై సగటున రూపాయి చొప్పున నష్టపోతున్నట్లు పౌల్ట్రీ రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దాణా, విద్యుత్‌పై సబ్సిడీ ఇస్తున్నా ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. మంత్రిని కలిసిన వారిలో పౌల్ట్రీ రైతులు సమరసింహారెడ్డి, దిలీప్‌కుమార్, మనోజ్, రాకేష్, ఆనంద్, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment