‘సక్సెస్’ అంతంతే! | success of gpa points in govt schools | Sakshi
Sakshi News home page

‘సక్సెస్’ అంతంతే!

Published Sat, Aug 16 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

‘సక్సెస్’ అంతంతే!

‘సక్సెస్’ అంతంతే!

 మెదక్: ప్రభుత్వ పాఠశాలల్లో పునాది లేని ఆంగ్ల మాధ్యమం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ విద్యార్థులకు జీపీఏ పాయింట్లు మాత్రం మొక్కుబడిగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్‌కేజీ నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతానన్న సీఎం కేసీఆర్ దాన్ని ఆచరణలోకి తీసుకువస్తే ‘సక్సెస్’ మంత్రం తన ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉంది.ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2008-09 విద్యా సంవత్సరంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టింది. అయితే 6వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు రెండు బ్యాచ్‌లు పదో తరగతి పరీక్షలు రాశాయి.

ఇందులో ఉత్తీర్ణత శాతం బాగానే ఉన్నప్పటికీ విద్యార్థులకు ఆశించిన జీపీఏ పాయింట్లు రావడం లేదని తెలుస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్ట్‌లకు ఆంగ్ల మాధ్యమంలో ఇబ్బందులు లేకపోయినప్పటికీ సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పరీక్షలు రాయడంలో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. పునాది స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం లేక పోవడంతో మధ్యంతరంగా 6వ తరగతిలో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకున్న విద్యార్థులకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి.

ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి ఆంగ్ల మాధ్యమం ఉండటం ద్వారా వారు ప్రభుత్వ పాఠశాలల కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి.  ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమాల్లో నర్సరీ స్థాయిలోనే విద్యార్థులు అక్షరమాల, అంకెలు, రైమ్స్ నేర్చుకుంటున్నారు. యూకేజీకి వచ్చేసరికి ఆంగ్లంలో వాక్యనిర్మాణం, కథలు చెప్పడం వంటివి చేయగలుగుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులతో సరితూగలేక పోతున్నారన్నది విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయం.

జిల్లాలో 220 సక్సెస్ పాఠశాలలు ఉన్నాయి. అటు ఆంగ్ల మాధ్యమంలోకి మారిన విద్యార్థులు, ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో పోటీ పడలేక పోగా,   ఆశించిన ఫలితాలు సాధించలేక పోతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎల్‌కేజీ నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పోషకులు, ఉపాధ్యాయులు ఆభిప్రాయపడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement