సాక్షి, బూర్గంపాడు(ఖమ్మం): అద్దె గర్భాల కోసం అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో సరోగసి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొందరు దళారులు అమాయక పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక అమానవీయ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొందరు డబ్బు కోసం సరోగసికి ఒప్పుకుంటుంటే.. మరికొందరు భర్త, కుటుంబసభ్యుల ఒత్తిళ్లు, బెదిరింపులకు తలొగ్గుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలలో సరోగసీ వ్యవహారం అక్కడక్కడా వెలుగుచూస్తోంది. గత రెండేళ్లుగా చర్ల, పినపాక, కరకగూడెం, బూర్గంపాడు, టేకులపల్లి, దుమ్ముగూడెం మండలాల్లో ఇలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.
అమాయక గిరిజన మహిళలే లక్ష్యంగా ఈ వ్యవహారం నడుపుతున్నారు. పేదలకు లక్షల రూపాయలు ఆశ చూపి వారిని పావులుగా వాడుకుంటున్నారు. డబ్బు కోసం కుటుంబసభ్యుల ఒత్తిళ్లు కూడా మహిళలపై తీవ్రంగా ఉంటున్నాయి. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా కొనసాగిన ఈ దందా ఇప్పుడు సూర్యాపేట, భువనగిరి తదితర ప్రాంతాలకు కూడా విస్తరించింది. భువనగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సరోగసీ కోసం సుమారు 100 మంది మహిళలను గుట్టుగా ఉంచినట్లు అక్కడి నుంచి బయటకు వచ్చిన ఓ మహిళ తెలిపింది. చిన్న వయసులో వివాహాలు జరిగి పిల్లలు పుట్టిన మహిళలను సరోగసీకి ఎంపిక చేసుకుంటున్నారు. వారికి తొలుత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత సరోగసీకి బలవంతంగా ఒప్పిస్తున్నారు. అయితే ఇది వికటించి కొందరు మహిళలు అనారోగ్యానికి గురైన ఘటనలు కూడా ఉన్నాయి. అమాయక పేద గిరిజన మహిళలతో అయిష్టంగా జరిపిస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.
భర్త వేధింపులు తాళలేక..
భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన రాణికి బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ భూక్యా రమేష్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, రెండుసార్లూ ఆపరేషన్ జరిగింది. కొద్ది రోజుల తర్వాత రమేష్ చెడు వ్యసనాలకు బానిసై డబ్బు కోసం రాణిని వేధించేవాడు. కొత్తగూడెంలో పరిచయమైన ఓ బ్రోకర్ సలహాతో భార్యతో సరోగíసీ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు అనుమానం రాకుండా హైదరాబాద్‌లోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేద్దామని నమ్మించి తీసుకెళ్లాడు. పిల్లలను తన తల్లి వద్ద ఉంచారు. నెల తర్వాత భువనగిరికి మకాం మార్చాడు. అక్కడ రాణిని సరోగíసీకి ఒప్పించేందుకు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె వినకపోవడంతో పిల్లలను చంపుతానని బెదిరించాడు. రాణి అత్త, ఆడపడుచు కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
అయినా ససేమిరా అనడంతో ఆమె తల్లిదండ్రులను కూడా చంపుతామని బెదిరించాడు. దీంతో తీవ్రంగా మానసిన వేదనకు గురైన రాణికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించి భువనగిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి సరోగసి చేశారు. కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం ఇంజెక్షన్లు, మందులు వేయడంతో రాణి ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో తాను గర్భం మోయలేనంటూ గత ఆదివారం ఆస్పత్రిలో గొడవ చేసింది. దీంతో మంగళవారం ఆమెకు అబార్షన్ చేయగా, పుట్టింటి వారి సహకారంతో గత బుధవారం కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌లో భర్త, అత్త, ఆడపడుచుపై ఫిర్యాదు చేసింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.
సరోగసీపై కేసు నమోదు
కొత్తగూడెం రూరల్: బలవంతంగా ఓ వివాహితకు అద్దె గర్భం చేయించిన ఘటనపై కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైనట్లు ఎస్సై నరేష్ తెలిపారు. బాధితురాలు రాణి ఫిర్యాదు మేరకు ఆమె భర్త రమేష్, అత్త భూళి, ఆడపడుచు రాధికపై కేసు నమోదు చేశామని చెప్పారు. రాణిని భువనగిరిలోని నవ్య నర్సింగ్ హోమ్‌కు తీసుకువెళ్లి, వివిధ పరీక్షలు నిర్వహించి ఆమెకు తెలియకుండానే గర్భం ఎక్కించారని, రాణి వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో ఇటీవల మరొకరి ఫోన్‌తొ ఆమె తల్లి, సోదరుడికి సమాచారం ఇచ్చిందని తెలిపారు. దీంతో తల్లి, సోదరుడు రాణి వద్దకు చేరుకుని అదే నర్సింగ్ హోమ్‌లో అబార్షన్ చేయించారని, వారి ఫిర్యాదు మేరకు పై ముగ్గురిపై కేసు నమోదు చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment