
మృత్యువుతో పోరాడి ఓడిన ఎస్ఐ సిద్ధయ్య
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా జానకిపురంలో ముష్కరులతో పోరాడిన... ఆత్మకూర్(ఎం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య (29) మృత్యువుతో పోరాడి ఓడారు. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం మృతి చెందారు. సిద్ధయ్య మృతి చెందినట్లు కామినేని వైద్యులు వెల్లడించారు. దాంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మరోవైపు సిద్ధయ్య మరణవార్త విని నల్లొండ జిల్లా పోలీసులను కూడా కలచివేసింది.
కాగా దుండగుల కాల్పుల్లో సిద్ధయ్య శరీరంలో 4 బుల్లెట్లు దూసుకు పోయిన విషయం తెలిసిందే. దాంతో 10 మందితో కూడిన వైద్య బృందం ఇప్పటి వరకు ఆయనకు 3 శస్త్రచికిత్సలు చేసింది. సుమారు 8 గంటల పాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకపోయిన ఒక బుల్లెట్ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజం వైపు దూసుకుపోయిన మరో బుల్లెట్‌ను తొలగించారు.
అలాగే, పొత్తి కడుపును పూర్తిగా ఓపెన్ చేసి ఇన్‌ఫెక్షన్ సోకిన భాగాలను శుభ్రం చేసినా, కడుపులోని బుల్లెట్ వల్ల ప్రా ణానికి ప్రమాదం లేక పోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. శరీరం శస్త్రచికిత్సకు సహకరించకపోవడంతో చిన్న మెదడులోకి దూసుకపోయిన మరో బుల్లెట్‌ను కూడా వదిలేశారు.