ఇప్పుడైనా మోక్షం కలిగేనా? | suryapet Two Town police station Formation how ? | Sakshi
Sakshi News home page

ఇప్పుడైనా మోక్షం కలిగేనా?

Published Sun, Sep 11 2016 3:04 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

ఇప్పుడైనా మోక్షం కలిగేనా?

ఇప్పుడైనా మోక్షం కలిగేనా?

 కలగానే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
 ప్రతిఏటా పెరుగుతున్న నేరాల సంఖ్య
 శాంతిభద్రతల పరిరక్షణకు సరిపోని సిబ్బంది
 అమలుకు నోచని నేతల హామీలు
 

 సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించింది. సూర్యాపేట జిల్లా హైదరాబాద్, విజయవాడ మహానగరాలకు మధ్యలో ఉండి అన్నిరంగాల్లో దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సూర్యాపేట పట్టణంలో 1952లో పట్టణంలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి పట్టణంలో శాంతిభద్రతల కోసం పోలీసులు పాటుపడుతున్నారు. 40 సంవత్సరాల క్రితం సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నియమించిన సిబ్బంది సంఖ్యే ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. 30 ఏళ్ల క్రితం పట్టణ జనాభా సుమారు 50 వేలు ఉండేది. ప్రస్తుతం లక్షా 70 వేలకు చేరింది. దీనికితోడు గతంకంటే  ప్రస్తుతం బైక్‌లు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాల సంఖ్య, పట్టణ విస్తీర్ణం కూడా పెరిగింది. అంతేగాక సూర్యాపేట హైదరాబాద్, విజయవాడ నగరాలకు మధ్య, ఇటు జనగామ, వరంగల్, మిర్యాలగూడ ప్రాంతాలకు మధ్య కేంద్రంగా ఉండడంతో నిత్యం ఇక్కడకు వివిధ పనుల నిమిత్తం వేలసంఖ్యలో జనం వచ్చివెళ్తుంటారు.
 
 సరిపడా లేని సిబ్బంది..
 పేటలో ఏర్పాటుచేసిన పోలీస్‌స్టేషన్‌కు 40 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన సిబ్బంది సంఖ్యే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం ఒక సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు ఏఎస్‌ఐలు, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 45 మంది కానిస్టేబుళ్లతోపాటు 36 మంది హోంగార్డులను పట్టణపోలీస్‌స్టేషన్‌కు కేటాయించారు. కాగా వీరిలో సుమారు 30 మంది వివిధ లూప్‌లైన్ డ్యూటీల్లో విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం బందోబస్తులతో ఉన్న సిబ్బంది వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఉన్న సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకు సరిపోవడం లేదు. పోలీస్ మ్యాన్‌వల్ ప్రకారం.. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పోలీస్‌ను నియమించాల్సి ఉంది. ఆ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. కాగా జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట పట్టణాలు గ్రేడ్-1 మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నల్లగొండలో రెండు పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయ గా గ్రేడ్-2 మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడలో రెండు పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఆ విధంగా చూసుకుంటే సూర్యాపేటలో మిర్యాలగూడ కంటే ముందుగానే టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. గత హోంమంత్రి జానారెడ్డి ‘పేట’లో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు.
 
 నేరాల సంఖ్య పెరుగుతున్నా..
 పట్టణంలో ఆస్తి తగాదాలు, ఈవ్‌టీజింగ్, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, భార్యాభర్తల ఘర్షణలు, మిస్సింగ్ కేసులు ఇతర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాదిలో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వంద నుంచి 200 కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం 560 కేసులు తగ్గకుండా నమోదవుతున్నాయి. వాటిని అదుపుచేసేందుకు ఒక్కటే పోలీస్‌స్టేషన్ ఉండడంతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. పేటలో రెండు పోలీస్‌స్టేషన్‌లు ఉంటే నేరాలను అదుపుచేయడం పోలీసులకు సులువుగా ఉంటుంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు పేటలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
 
 ప్రతిపాదనలు పంపించాం
 సూర్యాపేట జిల్లా కేంద్రం అవుతున్న తరుణంలో టూటౌన్ స్టేషన్‌తోపాటు మహిళా, సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. నివేదికలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రం కాబట్టి ఈ స్టేషన్లు తప్పనిసరిగా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ట్రాఫిక్ స్టేషన్‌కు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అవసరం ఉండటంతో అట్టి ప్రతిపాదనలను కూడా పంపించాం.
 - వి.సునితామోహన్, డీఎస్పీ, సూర్యాపేట
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement