బీబీనగర్ (భువనగిరి) : మాటల గారడితో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. బీబీనగర్ నిమ్స్‌లో ఇన్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించి, ఎయిమ్స్‌కు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిమ్స్ పంచాయితీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని 12 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కేంద్రం ఎయిమ్స్‌ను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్థలాన్ని కేటాయించకుండా జాప్యం చేస్తోందన్నారు. నిమ్స్‌పై చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ది చెబుతారని అన్నారు. అంతకుముందు నిమ్స్‌ను పరిశీలించారు.
కుప్పకూలిన సభా ప్రాంగణం
నిమ్స్ ప్రాంగణం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన నిమ్స్ పంచాయితీ కార్యక్రమం కోసం ఏ ర్పాటు చేసిన సభా ప్రాంగణం, టెంట్లు ఎక్కడికక్కడ కుప్పకూలాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురి సింది. దీంతో టెంట్లు ఎక్కడివక్కడ కుప్పకూలాయి. ఆసమయంలో సభా వేదికపై ఉన్న లక్ష్మణ్‌ను కార్యకర్తలు బయటకు తీసుకొచ్చారు. టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు.
పలువురికి గాయాలు..
టెంట్లు కూలిన సమయంలో వాటి కింద ఉన్న పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన శ్రీనివాస్, బీబీనగర్‌కు చెందిన రాంపల్లి అంజమ్మకు తీవ్ర గాయాలు కావడంతో వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సభా ప్రాంగణం సమీపంలో పార్కింగ్ చేసిన వాహనాలపై టెంట్లు, ఐరెన్ రాడ్లు పడడంతో ధ్వంసమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment