
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయండి
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లుపై వెంటనే అనర్హత వేటువేయాలని స్పీకర్ మధుసూదనాచారికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ మరోసారి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి స్పీకర్‌ను ఆయన నివాసంలో తెలంగాణ వైఎస్సార్‌సీపీ పక్షనేత పాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ కలుసుకుని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు నోటీసు ఇచ్చినందున, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు ఇప్పటివరకు నోటీసే ఇవ్వలేదన్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తుపై గెలుపొం దిన తాటి వెంకటేశ్వర్లు, జనవరి 9న కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విదితమే. గతంలో మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు సమర్పించిన తాటి వెంకటేశ్వర్లు ఆ తర్వాత తానూ టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారని, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దుచేయాలని మరోలేఖలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.