సిరిసిల్ల జిల్లాలో పోలీసులు సాగించిన పాశవిక చర్యను టీపీసీసీ ఖండించింది.
హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాలో పోలీసులు సాగించిన పాశవిక చర్యను టీపీసీసీ ఖండించింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలపై 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచక్షణ లేకుండా కొట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఘటనతో మనం సభ్య సమాజంలో ఉన్నామా లేదా అనే అనుమానం వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశంలో జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, పొన్నాల లక్ష్మయ్య, సంపత్ కుమార్, గీతారెడ్డి, సర్వే సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బీసీలపై పోలీసులు, టీఆర్‌ఎస్ నేతల దాడులపై చర్చించారు. ఇసుక మాఫియాకు నాయకులు, అధికారులు అంటకాగుతుంటే ప్రజలే సిరిసిల్లలో తిరగబడ్డారని భట్టి తెలిపారు.
మానవత్వం కలిగిన కరీంనగర్ జైలర్ బాధితుల పరిస్థితిని చూసి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారని వివరించారు. దీనిపై ఎస్సీ కమిషన్, హెచ్చార్సీకి, న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం పై ఉద్యమించటంతోపాటు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఛలో సిరిసిల్ల, ఛలో నేరెళ్ల చేపడతామన్నారు. సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ మానవత్వానికి మచ్చ తెచ్చారని, ఆయనపై అట్రాసిటీ కేసు పెడతామన్నారు. సిరిసిల్ల సంఘటన పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందని కె.జానారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఆందోళనలు చేపడతామన్నారు. అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల ఘటన దారుణమని గీతారెడ్డి అన్నారు. ఎస్పీ వ్యవహారం సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలను భయపెట్టడం, కాంగ్రెస్ కార్యకర్తలను వేధించడం ఇదే పోలీసుల విధానంగా ఉందని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. సిరిసిల్ల ఘటన బాధ్యులను 24 గంటల్లోపు అరెస్ట్ చేయించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కేసీఆర్ కుటుంబానికి సంబంధముందని ఆయన ఆరోపించారు.