
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తోంది. కూటమిలో భాగమైన తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి తాము పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందజేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆశావహుల నుంచి అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తుల నుంచి ముగ్గురి పేర్లను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసి, ఏఐసీసీకి పంపనుంది. ఈ పరిణామాల క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అశావహులు టికెట్ల కోసం హైదరాబాద్‌లో మంత్రాంగం ప్రారంభించారు. డీసీసీ నుంచి వచ్చిన జాబితాల ఆధారంగా పీసీసీ అభ్యర్థుల జాబి తాలో తమ పేర్లు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నా రు. ఉమ్మడి జిల్లా నుంచి కొత్తగా పార్టీలో చేరిన ఒకరిద్దరు బలమైన నాయకులకు పార్టీ టికెట్లు ఖ రారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్లాష్ సర్వే ద్వారా టికెట్ల కోసం తుది జాబితాను సిద్ధం చేసే స్క్రీనింగ్ కమిటీ వైపే అందరూ చూస్తున్నారు.
కాంగ్రెసేతరులకు పొత్తుల్లో ఏదో ఒక సీటే..
కూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి టీడీపీ ఏ ఒక్క సీటును ఆశించడం లేదు. ఆ పార్టీ తనకు బలమైన అభ్యర్థులున్న ఇతర జిల్లాల నుంచి ఆశావహుల పేర్లను కాంగ్రెస్ పార్టీకి అందజేసింది. అందులో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా లేదు. సీపీఐ రాష్ట్రంలో ఐదు సీట్లు కోరుతుండగా, నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. కాగా సీపీఐ పంపించిన జాబితాలో ఐదో సీటుగా మంచిర్యాలను చేర్చారు. బెల్లంపల్లిలో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఆసక్తి చూపకపోవడంతో సీపీఐ మంచిర్యాలను కోరుతోంది. జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సీపీఐ ఐదు సీట్లు పోటీ చేస్తే మంచిర్యాల సీపీఐ ఖాతాలోకి వెళ్లనుంది. టీజేఎస్ ఎన్ని సీట్ల నుంచి పోటీ చేస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించినా, సికింద్రాబాద్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కోదండరాం నివాస ప్రాంతం ఉన్న బెల్లంపల్లి స్థానాన్ని టీజేఎస్ కోరే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది సీట్లలో తొమ్మిదింట కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేయడం ఖాయమైనట్టే.
కాంగ్రెస్‌లో మూడు చోట్ల ఖరారైనట్టే...
కాంగ్రెస్ పార్టీలో నిర్మల్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారైనట్టే. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ నుంచి పోటీ చేయడం లాంఛనమే. ఈ నేపథ్యంలో నిర్మల్ పట్టణంతో పాటు ఊరూరా ఫ్లెక్సీలతో నింపేశారు. ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అభ్యర్థిత్వం ప్రకటించడమే మిగిలింది. ఖానాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు సీటివ్వడంతో టీఆర్‌ఎస్‌ను వీడిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ టిక్కెట్టు హామీతో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన అభ్యర్థిత్వం కూడా ఖాయమైనట్టే. ఈ మూడు నియోజకవర్గాల్లో వీరిని అభ్యర్థులుగా ప్రకటించడం ఒక్కటే మిగిలిందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి.
మూడు చోట్ల నామమాత్రపు స్క్రీనింగే...
ఉమ్మడి జిల్లాలోని బోథ్, సిర్పూరు, చెన్నూరు సీట్ల విషయంలో కూడా అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయినప్పటికీ, మొక్కుబడిగా స్క్రీనింగ్ కమిటీ ఫ్లాష్ సర్వే ద్వారా తతంగం పూర్తి చేస్తారని తెలిసింది. బోథ్‌లో మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు సీటు విషయంలో రెండో మాట లేకపోయినా, ఆదివాసీలకు కాకుండా లంబాడాలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఎదురైతే తమ పేరు పరిశీలించాలని గతంలో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసిన నరేష్ జాదవ్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనిల్ జాదవ్ కూడా టెకెట్టు ఆశిస్తున్నారు. సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌రావు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు టికెట్టు ఖాయమని సమాచారం.
అయితే గతంలో రేవంత్‌రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రావి శ్రీనివాస్, బీసీ నాయకుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ సైతం టికెట్టు ఆశిస్తున్నారు. చెన్నూరులో గ్రూప్–1 అధికారిగా ఎక్సైజ్, ఇతర శాఖల్లో పనిచేసిన బొర్లకుంట వెంకటేష్ నేతకే టికెట్టు ఖాయమైనట్లు సమాచారం. ఏఐసీసీ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడైన మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు ద్వారా వెంకటేష్ నేత టిక్కెట్టుపై ధీమాతో ఉన్నారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్మెల్యే సోత్కు సంజీవరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ మాత్రం స్థానికులకే టికెట్టు ఇవ్వాలనే డిమాండ్‌తో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
మంచిర్యాల, ఆదిలాబాద్, ముథోల్‌లలో సస్పెన్స్
మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడుగా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు టికెట్టు రేసులో ముందున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన ప్రేంసాగర్‌రావు గత కొంతకాలంగా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ఉన్నారు. ప్రేంసాగర్‌రావు కానిపక్షంలో మహిళా కోటాలో ఆయన భార్య కొక్కిరాల సురేఖను బరిలోకి దింపేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. ప్రేంసాగర్‌రావుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మద్ధతు కూడా ఉండడం కలిసొచ్చే అంశం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి కూడా పార్టీ టికెట్టు రేసులో ఉన్నారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరున్న అరవింద్‌రెడ్డి తనకే టికెట్టు వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లు స్క్రీనింగ్ కమిటీకి చేరనున్నాయి. ఫ్లాష్ సర్వేలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
∙ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డితో పాటు గతం లో పార్టీ అభ్యర్థులుగా పో టీ చేసిన గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్‌పాం డే సీటు కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో ము ఖ్యలు. మంత్రి జోగు రామన్న సామాజిక వర్గానికి చెందిన గండ్రత్ సుజాతకు సీటిస్తే గట్టి పో టీ ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఆమె భట్టి విక్రమార్క వర్గీయురాలిటీ టికెట్టు రేసులో ముందున్నారు. అలాగే మహేశ్వర్‌రెడ్డి వర్గీయుడిగా ఉన్న భార్గవ్ దేశ్‌పాండే కూడా టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు.
ముథోల్‌లో వరుసకు సోదరులైన రామారావు పటేల్, నారాయణరావు పటేల్ మధ్య టికెట్టు పోటీ ఉంది. ఇద్దరి పేర్లను డీసీసీ గాంధీభవన్‌కు పంపించింది. వీరు కూడా ఎవరికి వారే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు సోదరులు కలిసి కట్టుగా పనిచేస్తే తిరుగుండదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి సీటొస్తుందో చూడాలి.
బెల్లంపల్లి ఎవరికి..?
ల్లంపల్లిని టీజేఎస్‌కు కేటాయిస్తే ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఒకరిద్దరు నాయకులు సిద్ధంగా ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి టీజేఎస్‌లో చేరి నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్న దుర్గం గోపాల్‌తో పాటు ఉపాధ్యాయుడు ఇ.చంద్రశేఖర్, అడ్లూరి వెంకటస్వామి టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన చిలుముల శంకర్‌తో పాటు రొడ్డ శారద, దుర్గాభవాని వంటి నాయకులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. బెల్లంపల్లిలో బలమైన అభ్యర్థిగా గద్దర్ తనయుడు క్రాంతికిరణ్‌ను రంగంలోకి దింపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.