ఓ అమ్మాయిని అడ్డుపెట్టుకుని నాపై విమర్శలా?: రేవంత్
హైదరాబాద్ : శాసనసభ నుంచి తమను బహిష్కరించినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనను సభ నుంచి బయటకు పంపటమే కాకుండా.. వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తనపై బురద జల్లేందుకు ఒక అమ్మాయిని పావుగా వాడుకోవటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
తనుకు ఎవరితోనో సంబంధాలున్నాయని, అమ్మాయిలతో ఫోన్ చేసి తిట్టిస్తున్నారని, పైగా తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తారా చౌదరి వ్యవహారంలో తన ప్రమేయాన్ని బయటపెట్టాలని సవాల్ చేశారు. శాసనసభలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం లేదని..అసభ్య పదజాలంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి సీఎం కేసీఆర్ తమను తిట్టిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ముమ్మాటికి కేసీఆర్ ఫ్యామిలీ బడ్జెట్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఓ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ప్రశ్నించడంలో తప్పేముందన్నారు. పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తిచూపినందుకే తనపై చర్యలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో భూముల విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినందుకే కక్ష పెంచుకున్నారని ఆయన అన్నారు. తన ఇంటిపై దాడి చేయించడం, నల్లగొండలో తమ పార్టీ కార్యాలయంపై దాడి చేయించడం ఏం సంస్కృతి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయంలో నీడలా వెంటాడతానని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలపై ... కేసీఆర్ ఆరోపణలపై అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి ..నైతిక విలువల కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.