టీడీపీ వర్సెస్ ఎమ్మార్పీఎస్ | TDP vs MRPS at nizamabad district | Sakshi
Sakshi News home page

టీడీపీ వర్సెస్ ఎమ్మార్పీఎస్

Published Sun, Dec 28 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

టీడీపీ వర్సెస్ ఎమ్మార్పీఎస్

టీడీపీ వర్సెస్ ఎమ్మార్పీఎస్

* టీడీపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్
* ప్రతిఘటించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
* పోలీసుల రంగ ప్రవేశం.. స్వల్ప లాఠీచార్జి
* ధ్వంసమైన ‘మండవ ’ వాహనం ఆరుగురి అరెస్టు

 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు కొందరు ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్ కార్యకర్తలు ప్రయత్నించడం, ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించడం, కార్యకర్తలపై దాడికి దిగడంతో సదస్సులో రభస జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు యత్నించగా, వారిపైనా కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయగా, ఆగ్రహం చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కారును ధ్వంసం చేశారు.
 
 ఈ కేసులో పోలీసులు ఆరు గుర్ని అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ప్రసంగం కొనసాగుతుండగా ఒక్కసారిగా ఎమ్మార్పీఎస్ నాయకులు దూసుకొచ్చారు. ఏపీ అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ వేదికపై ఉన్న టేబుళ్లను తీసి విసిరేశారు. ఈ క్రమంలో టీడీపీ  కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌పై దాడికి దిగారు. ఎస్సైలు మధు, సైదయ్య వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ఎస్సైలకు సైతం దెబ్బలు తగిలాయి. టీడీపీ కార్యకర్తలు కుర్చీలను విసిరేశారు.  
 
 కేసీఆర్ టార్గెట్‌గా నేతల ప్రసంగాలు
 టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ టార్గెట్‌గా టీడీపీ సమావేశంలో ఆ పార్టీ నాయకులు నిప్పులు కురిపించారు. టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ప్రసంగం    ప్రారంభించినప్పటి నుంచీ ముగిం చేంత వరకూ కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. ‘అడుక్కోవడానికి వచ్చిన నీకు మా పార్టీ కార్యకర్తలు భిక్షంగా ఓట్లు వేసి గెలిపించారు. కానీ, గెల్చిన తరువాత ప్రజలు భిక్షమెత్తుకునే విధంగా చేస్తున్నావు... నువ్వు రావణాసురుడివైతే మా కార్యకర్తలు రాముళ్లై బాణాలను సంధిస్తారు. తెలంగాణ ఉద్యమంలో వెయ్యికి పైగా అమరులైతే, 459 మందే ఉన్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు.. సకల జనుల సర్వేలో కోళ్లు, మేకలు, పశువులు ఎన్ని ఉన్నాయో వివరాలు సేకరించిన నువ్వు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ప్రాణ, అవయవాల త్యాగం చేసినవారు మీ ఇంట్లో ఉన్నారా? అని సర్వేలో అడిగించావా’’ అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో బండారం బయటపెడ తాననే ఉద్దేశంతో తనను మాట్లాడనివ్వకుండా కుట్ర చేశారన్నారు. కాని ప్రజల ముందు నిజాలు బయటపెట్టి టీఆర్‌ఎస్ పార్టీ పీక నొక్కడం ఖాయమని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
 
 హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కన అమర వీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలని 20 సార్లు సీఎంకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బహుశా ఆయన పోయాక తన విగ్రహం పెట్టించుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. బుద్ధుడి పక్కన రూ. వెయ్యి కోట్లతో స్తూపం పెట్టే వరకు ఊరుకోబోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా అమర వీరుల త్యాగానికి గుర్తుగా ప్రత్యేక రోజును కేటాయించి హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వర్‌రావు, అరికెల నర్సారెడ్డి తదితరులు  కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. అనంతరం, జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 44 మంది రైతు కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున చెక్కులను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement