సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియరైంది. పదోన్నతులు లేకుండా కేవలం బదిలీలకే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయ సలహా మేరకు బదిలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు, సంఘ నేతలతో సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బదిలీలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతర్ జిల్లా బదిలీలు, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలు మాత్రం ఆగస్టులో నిర్వహించాలని.. ఈ నెల 4 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించి 20వ తేదీలోగా ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
పరిశీలకులుగా సీనియర్ అధికారులు..
టీచర్ల బదిలీలను ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పాత జిల్లాలకు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తారు. శనివారం నుంచి వారు జిల్లా అధికారులతో సమావేశమై ఉపాధ్యాయ ఖాళీలను ఖరారు చేస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లాల్లోని సంఘాల ప్రతినిధులకు మాత్రమే పాయింట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అధర్ సిన్హా, జాయింట్ సెక్రటరీ విజయకుమార్, అదనపు సంచాలకుడు పీవీ శ్రీహరి, సంయుక్త సంచాలకుడు శ్రీనివాసాచారి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రవీందర్, సంఘ నేతలు చావ రవి, కొండల్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, బి.భుజంగరావు, విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
బదిలీల షెడ్యూల్ ఇలా..
- 4, 5 తేదీల్లో వెబ్‌సైట్‌లో ఖాళీల జాబితా ప్రదర్శన
- 5న ఖాళీల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
- 6న ఖాళీల తుది జాబితా విడుదల
- 7–10 వరకు దరఖాస్తుల స్వీకరణ
- 11, 12 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన
- 13న దరఖాస్తుల్లో సవరణకు చాన్స్
- 20వ తేదీలోపు కౌన్సెలింగ్ పూర్తి
Comments
Please login to add a commentAdd a comment