కళాసమ్రాట్‌కు కన్నీటి వీడ్కోలు | tearful farewell to the Kalasamrat chukka sattaiah | Sakshi
Sakshi News home page

కళాసమ్రాట్‌కు కన్నీటి వీడ్కోలు

Published Sat, Nov 11 2017 1:40 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

tearful farewell to the Kalasamrat chukka sattaiah - Sakshi

సాక్షి, జనగామ: ఒగ్గు కథకు ప్రాణంపోసి.. ఓరుగల్లు కీర్తిని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిన కళాసమ్రాట్‌ డాక్టర్‌ చుక్క సత్తయ్య అలియాస్‌ చౌదరపల్లి సత్తయ్య(82)కు వివిధ పార్టీల నాయకులు, కళారంగ ప్రముఖులు, కళాకారులు కన్నీటి వీడ్కోలు పలికారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, బంధువులు, కుటుంబసభ్యుల అశ్రునయనాల నడుమ శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఒగ్గు కథా పితామహుడైన చుక్క సత్తయ్య అనారోగ్యంతో బాధపడుతూ గురువారం జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం మాణిక్యపురంలో మృతి చెందారు. అయితే అంత్యక్రియలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆయన మృత దేహం వద్ద మల్లన్న పట్నం వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం కురుమ కులస్తుల ఆచార సంప్రదాయాల ప్రకారం ఒగ్గు డోలు విన్యాసాల మధ్య శ్మశానవాటికకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. సత్తయ్య వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన ఆయన చితికి పెద్దకుమారుడు అంజయ్య నిప్పంటించగా అంత్యక్రియలు నిర్వహించారు.  

నాయకులు, కళాకారుల నివాళులు.. 
సత్తయ్య మరణవార్త తెలుసుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది కళాకారులు, నాయకులు మాణిక్యపురానికి తరలివచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సత్తయ్య పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సత్తయ్య మృతదేహం వద్ద ప్రజా గాయకుడు గద్దర్‌ పాటపాడారు. అలాగే వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, అరుణోదయ విమలక్క, ప్రముఖ కవి అందెశ్రీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరిలతోపాటు కవులు, రచయితలు, ప్రజా సంఘాల నాయకులు సత్తయ్యకు నివాళులర్పించి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఒగ్గు కథకు సత్తయ్య చేసిన సేవలు చిరస్థాయిగా నిలవాలంటే హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సత్తయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాలో కళాతోరణం నిర్మించాలని పలువురు కళాకారులు కోరారు. యూనివర్సిటీల్లో ఒక విభాగానికి చుక్క సత్తయ్య పేరును పెట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సత్తయ్య పేరు చిరస్థాయిగా నిలిచేలా చర్యలు
నిజామాబాద్‌ ఎంపీ కవిత
తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు.. ఒగ్గు కథనే తన జీవితంగా భావించుకుని దేశస్థాయిలో దానికి గుర్తింపు తీసుకువచ్చేలా చుక్క సత్తయ్య కృషి చేశారని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సత్తయ్య భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సత్తయ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సత్తయ్య తన ప్రాణంగా భావించిన ఒగ్గు కథను బతికించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సత్తయ్య కుటుంబానికి అండగా నిలుస్తామని కవిత హామీ ఇచ్చారు. అలాగే, కొత్తగా సాధించుకున్న స్వరాష్ట్రంలో కళాకారులను గౌరవిస్తూ పింఛన్లు, జీవనభృతిని కూడా అందిస్తున్నామని ఎంపీ కవిత అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement