కడుపుకోతేమిగిలింది | Tearful farewell to vishnu vardhan reddy | Sakshi
Sakshi News home page

కడుపుకోతేమిగిలింది

Published Tue, Jul 1 2014 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

కడుపుకోతేమిగిలింది

కడుపుకోతేమిగిలింది

బోధన్: కన్నవారికి కడుపుకోతే మిగిలింది. తమ కొడుకు వస్తాడని 22రోజులుగా ఎదురుచూస్తున్న వారి ఆశలు ఆడియాశలయ్యాయి. బియాస్‌నదిలో మరో మృతదేహం లభ్యమైంది.. అది బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిగా గుర్తించామని హిమాచల్‌ప్రదేశ్ నుంచి వార్త రాగానే.. ఆ కుటుంబం కుప్పకూలింది. ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించింది. ప్రమాదం జరిగినప్పటి నుంచే ఏకధాటిగా ఏడుస్తున్నా.. తమ బిడ్డ ఎలాగైన బతికి వస్తాడని కోటిఆశలతో ఉన్న ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి.

‘నాన్నా.. నేను విహారయాత్రకు వెళ్తున్నాను.. అని చెప్పి వెళ్లిన నా కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మమ్మల్ని ఇలా వదిలేసి పోతాడనుకోలేదు.’ అంటూ వెంకటేశ్వర్‌రెడ్డి దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. బియాస్ నదిలో కొడుకు గల్లంతైన విషయం తెలిసినప్పటి నుంచి తల్లి రమాదేవి మంచం పట్టింది. ఇప్పడింకా కోలుకోలేని స్థితిలో ఉంది. తమ బిడ్డ మధుర జ్ఞాపకాలను తలచుకుంటూ కుమిలిపోతున్న వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.
 
విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ నేపథ్యం
బోధన్ మండలలోని సాలంపాడ్‌కు చెందిన మేడం వెంకటేశ్వర్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు , ఇదే మండలంలోని అమ్దాపూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా  పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం బోధన్ పట్టణంలోని రాకాసీపేట్‌లో స్థిరపడ్డారు. వెంకటేశ్వర్ రెడ్డి బార్య రమాదేవీ దంపతులకు ఇద్దరు సంతానం. కుతూరు అనూష, కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. అనూష్ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీరు. విష్ణువర్ధన్ రెడ్డి వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ( ఎలక్ట్రానిక్ ఇస్ట్రుమెంట్‌షన్ ఇంజనీరింగ్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇరువురు బిడ్డలు ఉన్నత చదువుల్లో రాణిస్తుంటే వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబం ఎంతో ఆనందంతో ఉన్నారు.  
 
 విహార యాత్రకు ముందు..
విష్ణువర్ధన్ రెడ్డి బిటెక్ వార్షిక పరీక్షలో జూన్  1న పూర్తికాగా, 3న కళాశాల విద్యార్థులో విహార యాత్రకు వెళ్లాడు. ఏ నెలల మొదటి వారంలో నాన్నమ్మ ఆదిలక్ష్మికి బాగ లేదంటే బోధన్ వచ్చి మూడు రోజులు  ఇక్కడే ఉండి వెళ్లాడు. ఆ తర్వాత వార్షిక పరీక్షలుండటం ఉన్నాయని వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు . హైదరాబాద్‌లో ఉండి పోయాడు. జూన్ 3న కళాశాల విద్యార్థులతో విహార యాత్రకు వెళ్లి బియాస్ నది నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఇదే సమయంలో విష్ణు తల్లీదండ్రులు వెంకటేశ్వర్‌రెడ్డి భర్య రమాదేవితో కలిసి విశాఖపట్నంలోని బావమరిది శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు.
 
 జూన్ 8న శుభకార్యం ఉండగా, అదే రోజు బియాస్ నదిలో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని విమానంలో హిమాచల్‌ప్రదేశ్ చేరుకున్నారు. వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి, వారి స్నేహితులు రాజశేఖర్ కూడా అక్కడి వెళ్లారు. ఐదురోజుల పాటు అక్కడే ఉండి విష్ణు ఆచూకీ కోసం దుఖాన్ని దిగమింగుకుని  నిరీక్షించారు. కానీ విష్ణు ఆచూకీ తెలియకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. గల్లంతైన రోజు నుంచి విష్ణు తల్లి రమాదేవి నిద్రాహారాలు మాని మంచం పట్టింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు.  
 
22 రోజులకు లభ్యమైన మృతదేహం

విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ చదువుతున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నదిపై గల లార్జీడ్యాం వద్ద ఈనెల 8న ఫొటోలు దిగుతుండగా, ఆ డ్యాం గేట్ల ఎత్తివేయడంతో నీటి ప్రవాహంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఉన్నాడు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 20 మంది విద్యార్థుల మృత దేహాలను వెలికితీశారు.
 
మరో నలుగురు విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. 22 రోజులకు సోమవారం బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. బియాస్ నది గాలింపులో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు ఘటన స్థలం వద్ద ఉన్న కళాశాల ప్రతినిధి ప్రణయ్‌రెడ్డి విష్ణు  చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. విష్ణు మృత దేహాన్ని మండి జిల్లా కేంద్రంలో పోస్టు మార్టం నిర్వహించి హైదరాబాద్‌కు తరలించేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 3 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తి అవుతుందని సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం 9.50 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి స్వగ్రామమైన సాలంపాడ్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement