దుఃఖాన్ని దిగమింగి..
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన జిల్లాకు చెందిన విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి ఆచూకీ నాలుగు రోజులు గడిచినా లభించలేదు. దీంతో ఆయన తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి నిరాశతో స్వగ్రామానికి పయనమయ్యారు.
బోధన్ : నాలుగు రోజుల నిరీక్షణ ఫలించలేదు. బియాస్ నదిలో గల్లంతైన కుమారుడి ఆచూకీ లభించలేదు. నిరాశతో ఆ తండ్రి సంఘటన స్థలంనుంచి వెనుదిరిగారు. పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకొని స్వగ్రామానికి పయనమయ్యారు. హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి తోటి విద్యార్థులతో ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే.
విష్ణు బోధన్‌లోని రాకాసిపేట్ ప్రాంతానికి చెందినవారు. కుమారుడి ఆచూకీ కోసం తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడే ఉండి ఆచూకీ లభిస్తుందేమోనని వేచి చూశారు. వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీనివాస్‌రెడ్డి, ఆయన స్నేహితుడు రాజశేఖర్ మాత్రం అక్కడే ఉన్నారు.
గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి, సోదరి
బోధన్‌లోని రాకాసిపేట్ ప్రాంతంలోని స్వగృహంలో ఉన్న విష్ణు తల్లి రమాదేవి, సోదరి అనుష, అమ్మమ్మ కోటమ్మ, నానమ్మ ఆదిలక్ష్మి, ఇతర బంధువులు అతడి ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నారు. వివరాలు తెలియకపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. బంధువులు, స్నేహితులు వారిని ఓదారుస్తున్నారు.