బోధన్ విద్యార్థి గల్లంతు | Concern in the student's parents | Sakshi
Sakshi News home page

బోధన్ విద్యార్థి గల్లంతు

Published Tue, Jun 10 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

బోధన్ విద్యార్థి గల్లంతు

బోధన్ విద్యార్థి గల్లంతు

బోధన్/ బోధన్ టౌన్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల్లో జిల్లాలోని బోధన్ పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మేడమ్ విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యార్థి తండ్రి మే డం వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్నాన్న హిమాచల్‌ప్రదేశ్ బయలుదేరి వెళ్లిన ట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో విష్ణువర్ధన్‌రెడ్డి బీటెక్ (ఈఐఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈనెల 3న కళాశాలలోని విద్యార్థులతో కలిసి స్టడీ టూర్‌కు వెళ్లారు.అనూహ్యంగా నది నీటి ఉధృతిలో గల్లంతు కావడం ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది.
 
కుటుంబ నేపథ్యం ..
విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి మేడం వెంకటేశ్వర్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. మండలంలోని అమ్ధాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తల్లి రమాదేవి గృహిణి. సోదరి అనూష సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. బోధన్ మండలంలోని సాలంపాడ్‌కు చెందిన వీరి కుటుంబం బోధన్ పట్టణంలోని రాకాసీపేట్‌లో స్థిరపడింది.
 
‘పది’ వరకు బోధన్‌లోనే విద్యాభ్యాసం ..
ప్రాథమిక విద్య నుంచే విష్ణువర్ధన్‌రెడ్డి చదువులో ప్రతిభ కనబరిచే వాడని కుటుంబసభ్యులు తెలిపారు. 2009-10లో విష్ణువర్ధన్‌రెడ్డి పదో తరగతి పూర్తిచేశారు. 600 మార్కులకు గాను 547 మార్కులు సాధించారు. 2010-12లో హైదరాబాద్ లింగంపల్లి క్యాంపస్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. ఎంసెట్‌లో 18 వేల ర్యాంకును సాధించారు. ప్రస్తుతం వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి గల్లంతైన విషయం తెలుసుకుని బంధువులు బోధన్‌లోని ఆయన ఇంటికి తరలివస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద విషువర్ధన్‌రెడ్డి నానమ్మ ఆది లక్ష్మమ్మ, అమ్మమ్మ కోటమ్మ ఉన్నారు. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  
 
గోప్యంగా గల్లంతు సమాచారం ..
విష్ణువర్ధన్‌రెడ్డి గల్లంతు విషయాన్ని తల్లి రమాదేవికి తెలియకుండా కుటుంబసభ్యులు జాగ్రత్త పడ్డారు. భర్తతో పాటు శుభకార్యానికి వైజాగ్ వెళ్లిన రమాదేవి, సోమవారం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లో చెల్లెలు రమాదేవి ఇంట్లో ఆమె ఉన్నట్లు బంధువులు తెలిపారు. కొడుకు గల్లంతు సమాచారం తెలిస్తే తట్టుకోలేదని రమాదేవికి చెప్పకుండా విషయాన్ని గోప్యంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement