సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు కీలకమైన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం లభించింది. బుధవారం ఢిల్లీలోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రాజెక్టుకు ఉన్న అన్ని ప్రధాన అవరోధాలు తొలగిపోనున్నాయి. తాజా అనుమతి నేపథ్యంలో ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం మళ్లీ తెరపైకి రానుండగా, ప్రపంచంలోని ఎక్కడ్నుంచైనా కాళేశ్వరానికి అవసరమయ్యే నిధుల సేకరణకు వెసులుబాటు కలగనుంది.
అన్ని అనుమతులు వచ్చేసినట్టే!
టీఏసీ అనుమతులకు సంబంధించి బుధవారం జరిగిన భేటీలో కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, నీతి ఆయోగ్ సలహాదారు, భూగర్భ జల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు, కేంద్ర జల సంఘానికి చెందిన అన్ని విభాగాల సంచాలకులు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్) మురళీధర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) హరిరామ్ పాల్గొని ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం నిర్మాణ ప్రక్రియకు సంబంధించి లింక్ –1, లింక్ –2, లింక్ –3 పనుల పురోగతిని ప్రదర్శించారు. ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల నీటిని గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు రూపొందించిన ప్రణాళికను వివరించారు.
ఎల్లంపల్లిలో లభ్యమయ్యే 20 టీఎంసీల నీరు, మరో 25 టీఎంసీల భూగర్భ జలాలు కలుపుకొని మొత్తం ప్రాజెక్టు నీటి లభ్యత 240 టీఎంసీలు ఉండగా, ఇందులో నుంచి 237 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి కేంద్ర జల సంఘం ఇప్పటికే తన అంగీకారం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందులో 169 టీఎంసీలు సాగునీటికి, 30 టీఎంసీలు హైదారాబాద్ తాగు నీటి అవసరాలకు, 10 టీఎంసీలు దారి పొడవునా ఉండే గ్రామాల తాగునీటికి, 16 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలు, 12 టీఎంసీలు ఆవిరి నష్టం కోసం వినియోగించే ప్రణాళికపై వివరణ ఇచ్చారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల్లో 24 గంటల పాటు జరుగుతున్న పనులు, ఇప్పటికే జరిగిన రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చు అంశాలను వివరించారు.
అధికారుల ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన టీఏసీ.. సమావేశం అనంతరం ఏకగ్రీవంగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులను మంజూరు చేస్తూ తీర్మానించింది. ఈ మేరకు ఈఎన్‌సీలు మురళీధర్, హరిరామ్‌లు ఢిల్లీ నుంచి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం 9 కీలక అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు రావడంతో సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు లభించినట్లయింది. జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) మాత్రమే మిగిలి ఉంది. అన్ని అనుమతులు ఇప్పటికే రావడంతో ఈ అనుమతి త్వరలోనే వస్తుందని హరిరామ్ తెలిపారు.
మంత్రి హరీశ్ హర్షం
కాళేశ్వరానికి టీఏసీ అనుమతిపై నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. అనుమతుల సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎస్ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్, హరిరామ్‌లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లను అభినందించారు.
కాళేశ్వరానికి ఇప్పటి వరకు లభించిన అనుమతులివీ..
1. పర్యావరణ ప్రభావ నివేదిక తయారీకి టీఓఆర్
2. మేడిగడ్డ వద్ద 75% డిపెండబిలిటీతో 283.3 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్
3. అంతర్రాష్ట్ర అనుమతి
4. కేంద్ర భూగర్భ జల శాఖ
5. కన్‌స్ట్రక్షన్ అండ్ మిషనరీస్ డైరెక్టరేట్
6. అటవీ మంత్రిత్వ శాఖ తుది అనుమతి
7. పర్యావరణ తుది అనుమతి
8. ఇరిగేషన్ ప్లానింగ్
9. ప్రాజెక్టు అంచనా
,
Comments
Please login to add a commentAdd a comment