
బీటెక్ టీచర్లు!
ఇప్పటివరకు మూడేళ్ల సాధారణ డిగ్రీ, రెండేళ్ల పీజీ చేసిన ఉపాధ్యాయులు తెలుసు.. ఇంటర్ అర్హతతో డీఎడ్ చేసి పాఠాలు బోధిస్తున్న టీచర్లు ఉన్నారు.
* స్కూలు పిల్లలకు పాఠాలు చెప్పనున్న సాంకేతిక విద్యార్థులు
* బీఈడీకి బీటెక్, బీఈ విద్యార్థుల అనూహ్య స్పందన
ఇప్పటివరకు మూడేళ్ల సాధారణ డిగ్రీ, రెండేళ్ల పీజీ చేసిన ఉపాధ్యాయులు తెలుసు.. ఇంటర్ అర్హతతో డీఎడ్ చేసి పాఠాలు బోధిస్తున్న టీచర్లు ఉన్నారు. కానీ ఇకపై ఇంజనీరింగ్ (బీటెక్, బీఈ) చదివి, పాఠాలు బోధించే ఉపాధ్యాయులు రానున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బీఈడీ కోర్సు చేసేందుకు బీటెక్, బీఈ విద్యార్థులను కూడా అనుమతించిన నేపథ్యంలో ఇది సాధ్యం కానుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దీనికి మంచి స్పందన వస్తోంది కూడా. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ నేర్పాలన్న ఉద్దేశంతో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ).. బీటెక్, బీఈ విద్యార్థులకు బీఈడీ చేసే అవకాశాన్ని కల్పించింది.
- సాక్షి, హైదరాబాద్
స్పందన ఎక్కువే..
బీఈడీ కోసం ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి తెలంగాణలో బాగా స్పందన వస్తోంది. బీఈడీలో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ మెథడాలజీలకు ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హులు. అయితే బీటెక్‌లో కెమిస్ట్రీ అసలు లేకపోగా.. ఫిజిక్స్ కొన్ని బ్రాంచ్‌లకే పరిమితం. దీంతో మిగిలిన గణితం సబ్జెక్టునే బీఈడీలో ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు ఎడ్‌సెట్ గణితం మెథడాలజీకి 12 వేల దరఖాస్తులురాగా.. అందు లో 3 వేల దరఖాస్తులు ఇంజనీరింగ్ విద్యార్థులవేనని అధికారుల అంచనా. బీఈడీ చేయడానికి బీటెక్, బీఈ గ్రాడ్యుయేట్లకు 55 శాతం మార్కులు ఉండాలి.
ఉద్యోగ అవకాశాలు మెండు..
కేంద్రీయ విద్యాలయాలు, ఇంటర్నేషనల్, కార్పొరేట్, ఈ-కాన్సెప్ట్ స్కూల్స్ వంటి పాఠశాలలు ‘ఇంజనీరింగ్’ టీచర్ల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. వారికి బోధనా పద్ధతులు, విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేసే సామర్థ్యం తోడైతే ఎదురే ఉండదని భావిస్తున్నాయి. వీటిని బీఈడీ ద్వారా అందిపుచ్చుకోవచ్చని గ్రహించిన విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేగాక బీఈడీలో బోధనా పద్ధతులన్నింటినీ నేర్చుకోవచ్చు. తద్వారా ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో సైతం శిక్షణ ఇచ్చే పరిణతి సాధించవచ్చు.
ఎందుకు బీఈడీకి మొగ్గు..
ఇంజనీరింగ్ నుంచి బోధన వైపు మళ్లేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బీటెక్ చేసిన చాలా మంది గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలు కరువవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వినియోగించుకుని బీఈడీ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఇక బోధనపై ఇష్టం ఉన్న మరికొంత మంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో... ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధనకు పెద్దపీట దక్కుతుందని, ఈ క్రమంలో తమకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు.
విస్తృతంగా అవకాశాలు
‘‘నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మారుతున్నారు. వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచే కోర్సులు అవసరం. సాధారణ గ్రాడ్యుయేట్లతో పోల్చితే.. ఇంజనీరింగ్ వారు టెక్నికల్ పరిజ్ఞానంలో కొంచెం అడ్వాన్స్‌గా ఉంటారు. అటువంటి వారికి బోధన మెలకువలు తోడైతే బోధన రంగంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.’’
- ప్రొఫెసర్ పి.ప్రసాద్, ఎడ్‌సెట్-2015 కన్వీనర్
ఉద్యోగం కోసం..
‘‘బీటెక్ (సీఎస్‌ఈ) రెండేళ్ల క్రితం పూర్తి చేశాను. నేను చదివిన దానికి సంబంధం లేని రెండు మూడు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. నా సబ్జెక్టుకు సంబంధించిన ఉద్యోగాల కోసం అన్వేషించినా అందలేదు. దీంతో బీఈడీ వైపు మొగ్గు చూపాను.’’
- బి. కృష్ణకుమార్, రంగారెడ్డి