అచ్చంపేట/ఆమనగల్లు: తెలంగాణ ద్రో హులైన తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వర్‌రావులకు మంత్రి పదవులు ఇచ్చారని, టీఆర్‌ఎస్‌లో ఇంతకంటే బలమైన నాయకులు లేరా టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శిం చారు. మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు సముచిత స్థానం కల్పించలేదని, కడియం శ్రీహరిది ఏ కులమో ఆయనకే తెలియని పరిస్థితి ఉందన్నారు. బీసీ కులంలో పుట్టడమే తప్పా అని మహబుబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కన్నీరు పెట్టుకోవడం చూస్తే ఈ ప్రభుత్వం వెనకబడిన కులాలపై ఎంత ప్రేమ ఉందో అర్థమౌతుందన్నారు.
శుక్రవారం అచ్చంపేట పటేల్ ఫంక్షన్‌హాల్‌లో, ఆమనగల్లులోని వాసవీకల్యాణ మండపంలో శుక్రవారం అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గస్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం తెలంగాణ సెంటిమెంట్‌తోనే అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే సీఎం, మంత్రులు బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని, తామే టీడీపీ తరుఫున రూ.50వేలు చెల్లిస్తున్నామని చెప్పారు. పింఛన్లు, రేషన్‌కార్డులు లేని వారి జాబితా తయారు చేస్తే వారికి అందే విధంగా చూస్తామన్నారు. కొన్ని రోజులు ఆగితే తెలంగాణలో టీడీపీ కార్యకర్తల కష్టాలు తీరిపోతాయన్నారు.
చెంచులను తరలిస్తే ఊరుకోం..
పులుల సంరక్షణ పేరిటా చెంచులను తరలించాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని టీడీపీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నల్లమల అడవుల్లోని వజ్రాలు, విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకే ఈ కుట్ర చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. జిల్లా మంత్రు లు, ఎమ్మెల్యేలు దీనిపై నోరుమెదపడం లేదంటే వీరికి చెంచులపై ఎంత ప్రే ముందో అర్థమౌతుందన్నారు.
వైఎస్సార్ హయాంలో చెంచుల తరలింపు తెరపైకి వచ్చినప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత నల్లమల ప్రాంతానికి వచ్చి గంగోలు పెట్టి, ముసలి కన్నీరు కార్చిన విషయం గుర్తు చేశారు. వజ్రాలు అమ్ముకోవడం కోసం ప్రస్తుతం కేసీఆర్ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. భాష, చదువు, జీవ న విధానం తెలియని చెంచులు అడవి వదిలి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎలా జీవిస్తారని, కేసీఆర్‌ను అడవిలో ఉండమంటే ఉంటారా అని ప్రశ్నించారు.
గువ్వలాలు, గబ్బిలాల శబ్దదారులకు భయపడమని, జానడు లేనివారు ఏమి రాజకీయం చేస్తారో తామూ చేస్తామన్నారు. అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపుతామని, ఇక్కడే ఉండి పార్టీని గెలిపిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం లో ఉన్న మంత్రులంతా సన్నాసులే అని, అటు ఇటు కాని వారు మంత్రులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ ఇంటినిండా బంగారం నింపుకుంటే తెలంగాణ బంగారు తెలంగాణ కాదు అని అన్నారు.
దళితుడిని సీఎం చేసి, తెలంగాణకు కాపాల కుక్కలా ఉంటానన్ని చెప్పిన కేసీఆర్ తన కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకుని, పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి విమర్శించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు పేర్కొన్నారు. తాను ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే పి.రాములు తెలిపారు. ఆయా సమావేశాల్లో అచ్చంపేట పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా రెడ్డి, నేతలు గోపాల్, వెంకటరమణ, కందికొండ శ్రీధర్, టైలర్ శ్రీను, నాగయ్యగౌడ్, రవికుమార్, తిరుపతిరావు, గంటేల గోపాల్, చింతలపల్లి యాదయ్య, బాలస్వామిగౌడ్, జంగ య్యగౌడ్, దామోదర్, వెంకటయ్య, కండె సత్యం, పాల్గొన్నారు.
తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులా?
Published Sat, Apr 18 2015 1:08 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement