తెలంగాణలో సెప్టెంబర్‌లో బడ్జెట్ సమావేశాలు
* అసెంబ్లీ సందర్శన.. స్పీకర్, అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ
* ఏపీ సమావేశాలతో ఇబ్బంది లేకుండా షెడ్యూల్
* సభలో సీట్ల సంఖ్యను కుదించాలి
* అసెంబ్లీ నిర్వహణ ఖర్చులు 58 : 42 శాతం భరించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 10-13 తేదీల మధ్య ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. అదే సమయంలో అసెం బ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను కుదించాలన్నారు. త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జర గనున్నందున తెలంగాణలో 153 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని, అందుకు అనుగుణంగా సభలో సీట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, కార్యదర్శి డాక్టర్ రాజా సదారాం, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులతో సమావేశమయ్యారు.
ఆదివారం గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహణలో ఇబ్బందులు, ఉద్యోగుల విభజన, ఖర్చుల వివరాలను తెలుసుకున్నారు. సెప్టెంబర్ 10 నుంచే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ సెప్టెంబర్ 13న మెదక్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్నట్లు సమాచారం రావడంతో పునరాలోచనలో పడ్డారు. సెప్టెంబర్ 30లోపు బడ్జెట్ తప్పనిసరిగా ఆమోదం పొందాల్సిన అవసరం ఉన్నందున అదేనెల 10-13 తేదీల మధ్యలో సమావేశాన్ని ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు.
అసెంబ్లీవర్గాల సమాచారం మేరకు...కేసీఆర్ రెండుగంటలకుపైగా అసెంబ్లీలో గడిపారు. శాసనసభలో కలియదిరిగారు. ప్రస్తుతం ఉన్న సీట్లను పార్లమెంట్ తరహాలో అమర్చే అంశాన్ని పరిశీలించాలని, ఈశాన్యం నుంచి అసెంబ్లీలోకి ప్రవేశించే విధంగా మార్చాలని కోరారు.
మొత్తం సీట్ల సంఖ్యను 160 లోపు కుదించాలని, వాటిని 3 వరుసలకే పరిమితం చేయాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌కు ప్రత్యేకంగా బిజినెస్ రూల్స్‌ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్‌కు, చైర్మన్‌కు సూ చించారు. రెండురాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే కొనసాగుతున్నందున అందుకయ్యే వ్యయాన్ని తెలంగాణ, ఏపీ 42 : 58 శాతం వాటా భరించేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్, ఛైర్మన్‌తో కలిసి సీఎం భోజనం చేశారు.