కాంగ్రెస్ వల్లే ఆత్మహత్యలు
శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల
⇒ రైతుల ఆత్మహత్యలను మాకు అంటగట్టడమేమిటి?
⇒ మేం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చాం
⇒ గతంలో కంటే ఎక్కువగా ‘ఆసరా’ కల్పిస్తున్నాం
⇒ అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు
⇒ గాంధీ జెండా కప్పుకొని.. దానికి తూట్లు పొడిచారని వ్యాఖ్య.. నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పేద రాష్ట్రం కాదని, సుసంపన్నమైన రాష్ట్రమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్ని అవరోధాలు, ఆటంకాలున్నా.. ఉన్నంతలో ఉత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రమైనా, అనుభవం లేకున్నా.. జిమ్మేదారీతనంతో కేటాయింపులు చేశామన్నారు. మంగళవారం శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఈటెల మాట్లాడారు. తమ తొలి బడ్జెట్ అంచనాల్లో 80 శాతం లక్ష్యాన్ని అందుకున్నామని..
అందుకే అంచనాల్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు బడ్జెట్ పత్రాలను చదువుకొని వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమెవరని, గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ఈటెల ప్రశ్నించారు. గత ప్రభుత్వాల సరళీకృత విధానాలు, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ రైతుల ఉసురు పోసుకున్నాయని వ్యాఖ్యానించారు.
ముక్కు నేలకు రాస్తా..
ఆంధ్రా సర్కారు కక్షతో కరెంటు ఇవ్వకపోయినా.. వ్యవసాయానికి రెండు విడతలుగా ఆరు గంటల విద్యుత్ అందిస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేకపోతే పసిపిల్లలను చెట్లకు ఉయ్యాలలో వేయాల్సి వచ్చేదని ఎద్దేవా చేశారు. ‘‘గతంలో ఏప్రభుత్వమైనా జెన్‌కో, ట్రాన్స్‌కోల్లో ఒక్క రూపాయైనా పెట్టుబడి పెట్టిందా? పెట్టుబడులు పెట్టి ఉంటే ముక్కు నేలకు రాస్తా. వ్యవసాయానికి కేవలం 2 శాతం నిధులు కేటాయించామనడం భావ్యమేనా..? వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ. 9,156 కోట్లు.. అంటే ప్రణాళికా వ్యయంలో 18 శాతం కేటాయించాం.. రైతు రుణాల మాఫీకి మొదటి విడతగా ఒకేసారి రూ. 4,250 కోట్లు విడుదల చేస్తే.. అభినందించాల్సింది పోయి విమర్శలా..’’ అని ఈటెల మండిపడ్డారు.
‘‘నీలం తుపాన్‌లో నష్టపోయిన తెలంగాణ రైతులు నాలుగేళ్లు వేడుకున్నా చెల్లించని రూ. 480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఒకే జీవోలో ఇచ్చాం. అప్పట్లో అది అడగడానికి వెళితే ఇదే శాసనసభలో చాంబర్ ముందు బూటు కాళ్లతో తన్నుకుంటూ పోయిన ప్రభుత్వం మీది కాదా..?’’ అని ఆర్థిక మంత్రి నిలదీశారు. గాంధీ జెండా కప్పుకొని.. ఆ జెండాకు తూట్లు పొడిచిన సంస్కృతి మీదంటూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జాతిపిత గాంధీ తమ నాయకుడని.. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వకుండా.. విమర్శల దాడి చేయటం తగదన్నారు. కాగా.. వేములవాడ దేవస్థానం అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించాలని వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్. రమేష్ కోరారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలోని షావలి దర్గా, జహంగీర్ పీర్ దర్గాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. నక్కలగండి-దిండి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు సరిగా లేదని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు.
పదేళ్ల సడలింపునకు సిద్ధం
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల్లో వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. దీనిపై బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఈటెల సమాధానమిచ్చారు. ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లు సడలించేందుకు అభ్యంతరం లేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి రామచంద్రమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు.
ఏజెన్సీలో ఎస్సీలకురూ. 5 లక్షలు డిపాజిట్
ఎమ్మెల్యే పాయం డిమాండ్
ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితులకు మూడెకరాల భూమి ఇచ్చే పరిస్థితి లేనందున.. వారి పేరున రూ. 5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసి, వడ్డీని పొందేలా ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 525 దళిత కుటుంబాలకు ఐదేసి ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమిని కేటాయించిందని.. అయితే ఏజెన్సీల్లో నివసించే దళితులకు ఆ అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎస్టీలకు కూడా మూడెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, అంగన్‌వాడీ వర్కర్ల తరహాలో ఆశ వర్కర్లకు కూడా జీతాలు పెంచాలని పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.