బోనభాగ్యం.. ఇక నుంచి అధికారిక సంబరం | Telangana Bonala festival celebrations started from Aashdam | Sakshi
Sakshi News home page

బోనభాగ్యం.. ఇక నుంచి అధికారిక సంబరం

Published Sun, Jun 29 2014 6:21 AM | Last Updated on Mon, Aug 20 2018 5:39 PM

బోనభాగ్యం..  ఇక నుంచి అధికారిక సంబరం - Sakshi

బోనభాగ్యం.. ఇక నుంచి అధికారిక సంబరం

* తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం
* ఇక నుంచి అధికారిక సంబరం
* ‘అమ్మా బెలైల్లినాదో నాయనా.. తల్లీ  బయలెల్లినాదో నాయనా..’  

 ఏటా ఆషాఢ మాసంలో ఈ గానం భాగ్యనగరాన్ని పులకింపజేస్తుంది. ఆధ్యాత్మికతలో ఓలలాడిస్తుంది. నాలుగు శతాబ్దాల పైచిలుకు నగరంలో అన్ని వర్గాల ప్రజలు, విభిన్న సంస్కృతులను ఐక్యం చేసే మహోన్నత చారిత్రక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. జాతీయ ఖ్యాతి గడించిన విశిష్ట వేడుక. ఆషాఢంలోని తొలి ఆదివారం లేదా గురువారం ప్రారంభమయ్యే పండుగను నెల రోజులు నిర్వహిస్తారు. రాష్ర్టప్రభుత్వం అధికారిక ఉత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నేడు గోల్కొండ కోటలో బోనాలకు శ్రీకారం. వచ్చే నెల 27 వరకు కోటపై తొమ్మిది రకాల పూజలు  నిర్వహిస్తారు. ఇవే రోజుల్లో పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వేడుకలూ ప్రారంభమవుతాయి. నగరమంతటా సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’ ప్రత్యేక కథనం..  
 
 గోల్కొండ రాజధానిగా పాలించిన కుతుబ్‌షాహీల కాలంలోనే బోనాలకు శ్రీకారం చుట్టారు. అబుల్ హసన్ తానీషా కొలువులో మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నల సలహాతో తానీషా తన కోటపైన శ్రీ జగదాంబిక, మహంకాళి అమ్మవార్ల ఆలయాన్ని కట్టి ఉత్సవాలు ప్రారంభించాడు. తరువాత అధికారంలోకి వచ్చిన అసఫ్‌జాహీలు వాటిని కొనసాగించారు. ఇది ఆనవాయితీగా మారింది. కోటపై ఉన్న అమ్మవారిని గోల్కొండ ఛోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి  ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో తిరిగి కోటపైన ప్రతిష్టిస్తారు.  
 
 నవాబు పూజతో శాంతించిన మూసీ

 1908 సెప్టెంబర్‌లో మూసీ వరదల కారణంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వరద నీరొచ్చింది. వరదలో అప్పటికే వేలాది మంది చనిపోయారు. నాటి  హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి రాజా కిషన్ పర్షాద్ లాల్‌దర్వాజా అమ్మవారి మహత్యాన్ని  నిజాం నవాబుకు వివరించారు. ఆలయంలో పూజలు చేస్తే అమ్మవారు శాంతించి వరదలు తగ్గుముఖం పడతాయన్నారు. దీంతో నవాబు ఒక   బంగారు చాటలో కుంకుమ, పసుపు, మేలిమి ముత్యాలు తీసుకొని  పూజలు చేశారు. అలా ఈ  ఆలయంలో  బోనాల వేడుకలు  ప్రారంభమయ్యాయి. 1968లో కంచి కామకోటి పీఠాధిపతి  చంద్ర శేఖరేంద్ర సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు. 2008 ఏప్రిల్‌లో అప్పటి కంచి పీఠాధిపతి  జయేంద్ర సరస్వతి స్వర్ణ శిఖరం, వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు.
 
 ఆరోగ్యమంత్రం
 బోనాల వేడుకల్లో  ప్రతీ ఘట్టం  ఆరోగ్య పరిరక్షణతో ముడిపడిందే. తొలకరి వర్షాలతో పాటే వాతావరణం  పూర్తిగా మారిపోతుంది. దీంతో  రకరకాల  వ్యాధులు  ప్రబలుతాయి. నీటి కాలుష్యం వల్ల కలరా వంటి  అంటువ్యాధులు వ్యాపిస్తాయి. అలాంటి కలుషిత వాతావరణాన్ని  శుభ్రం చేసే  అద్భుతమైన  ప్రక్రియ బోనాల పండుగలో ఉంది. ఇంటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని  శుభ్రం చేసుకొని పసుపు, గుగ్గిలం, మైసాక్షి వంటి వాటిని పొగ వే యడం వల్ల  వ్యాధికారక క్రిములు  నశిస్తాయి.
 
 ఇక వేపచెట్టు గొప్పతనం అందరికీ  తెలిసిందే. వేపాకు ముద్దను  ఒంటికి పట్టించి  స్నానం చేస్తే  చర్మవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులకు వేప దివ్య ఔషధం. బోనాల పండుగ రోజు  వేప కొమ్మలతో  బోనాలను అలంకరించినా, గుమ్మానికి, దర్వాజలకు వాటిని వేలాడదీసినా స్వచ్ఛమైన  గాలి  లభిస్తుంది. ఇక బోనం. కొత్త కుండలో పసుపుతో కలిపి అన్నం వండడం కూడా  ఆరోగ్య పరిరక్షణలో  భాగమే. ఈ వేడుకల్లో ఆరోగ్యభాగ్యం కూడా ఇమిడి ఉందని నగరానికి చెందిన ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అభిప్రాయపడ్డారు.
 
 వరాల వల్లి.. ఉజ్జయిని మహంకాళి

 సికింద్రాబాద్  ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జూలై 13, 14వ తేదీల్లో జరుగుతాయి. ఈ వేడుకలకు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 1813లో కలరా సోకింది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఇది అక్కడ మిలటరీ విధులు నిర్వహిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరటి అప్పయ్యను కలచి వేసింది. వెంటనే ఆయన ఉజ్జయినీ మహంకాళిని... కలరాను తగ్గించమనీ, అలా చేస్తే తన స్వస్థలంలో ఆలయం నిర్మిస్తామని వేడుకున్నారు. కలరా అదుపులోకి వచ్చింది. దీంతో అప్పయ్య సహచరుల సాయంతో 1815లో సికింద్రాబాద్‌లో కర్ర విగ్రహాన్ని ప్రతిష్టించి ‘ఉజ్జయినీ మహంకాళి’గా నామకరణం చేశారు. 1864లో ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అప్పయ్యే చేయించి, ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. 1953 నుంచి దేవాదాయ శాఖ  వేడుకలు నిర్వహిస్తోంది.  
 
 చల్లని చూపుల... శీతల్‌మాత
 పిల్లా పాపలను ఆయురారోగ్యాలతో  చల్లంగా చూసే అమ్మవారు శీతల మాత. సుల్తాన్‌షాహీలో వెలసిన ఈ అమ్మవారిని భక్తులు శీతల్ మాతగా... సిత్లా మాతగా కొలుస్తున్నారు. వందేళ్ల కిందట నిజాంల పాలన లో ఆర్థిక లావాదేవీలు చూసే అధికారిగా ఉన్న శాలిబండ దేవ్‌డీ నివాసి  రాజా కిషన్ పర్‌షాద్ ఈ దేవాలయాన్ని సుల్తాన్‌షాహిలో నిర్మించారు. పిల్లలకు మశూచి, ఆటలమ్మ (చికెన్‌పాక్స్)లు వచ్చినప్పుడు  అమ్మవారికి  సాక పెట్టి పూజించేవారు. 1976లో ఆలయ కమిటీ ఏర్పడిన అనంతరం  శ్రీ జగదాంబ దేవాలయంగా నామకరణం చేశారు.  
 
 మీరాలంమండి అమ్మ
 నిజాం కాలంలో   గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతీరోజు రైతులు కూరగాయలు,ధాన్యం ఎడ్ల బండ్లపై మీరాలం మండికి   తీసుకువచ్చిన రైతులు తమ ఎడ్ల బండ్లను ‘బండిఖానా’ లో నిలిపేవారు. ఇక్కడే  ఒక రావిమొక్కను నాటి  దాని వద్ద అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు చేశారు.  1960లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన చేసినప్పటి నుంచి  ఆషాఢ మాసం మూడో బుధవారం రోజు బోనాల పండుగ జరుగుతుంది.
 
 ఐదు తరాలుగా..
 అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత జరిగే రెండో ప్రధాన ఘట్టం రంగం. ఇందు లో ఏటా స్వర్ణలత చెప్పే ‘భవిష్యవాణి’కి ఎంతో ప్రాముఖ్యత. ఆ వివరాలు ఆమె వూటల్లోనే...
 వూ అమ్మపేరు ఎరుపుల ఇస్తారమ్మ. నాన్న నరసింహ. అక్క స్వరూప. తమ్ముడు దినేష్. నాతో కలిపి అమ్మ నాన్నలకు ముగ్గురు పిల్లలం. ప్రస్తుతం మారేడుపల్లిలో ఉంటున్నాం. మా ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే అమ్మవారికి అంకితం చేసే ఆచారం అనాదిగా వస్తోంది. అక్క స్వరూపను, నన్ను ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి అంకితం చేశారు. బడికి వెళ్లినా పెద్దగా చదువుకోలేదు. అక్క స్వరూప చనిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర రంగంలో భవిష్యవాణి వినిపించే బాధ్యత తీసుకున్నా.
 
 అక్కన్న,మాదన్నలు కొలిచిన తల్లి

 హరిబౌలిలోని అక్కన్న మాదన్నల మహంకాళి దేవాలయం హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నం. పాతబస్తీలోని ఈ ఆలయం లోని అమ్మవారికి భక్తులు 17వ శతాబ్దం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. గోల్కొండ రాజు తానీషా వద్ద కీలక హోదాల్లో పనిచేసిన అక్కన్న, మాదన్నలిరువురు అన్నదమ్ములు. వారు విధినిర్వహణలో భాగంగా రోజూ కోటకు వెళ్లే ముందు ఇక్కడ పూజలు నిర్వహించే వారు. 1948లో జరిగిన సైనిక చర్య తరువాత అప్పటి ఆర్యసమాజ్ ఈ ఆలయాన్ని గుర్తించింది.
 
 కోటకు రక్షణగా.. మైసవ్ము
 శాలిబండ హరిబౌలిలోని శ్రీ బంగారు మైసవ్ము దేవాలయుం  పాతబస్తీ భక్తుల పాలిట కొంగుబంగారం. నిజాం పరిపాలనలో ప్రధాని కిషన్ పర్షాద్ దేవిడీలోనే శ్రీ బంగారు మైసమ్మ ఆలయం వెలసింది. కోట రక్షణ గోడకు ఎడమ వైపున అమ్మవారి దేవాలయం ఉంటే అన్ని విధాల కలిసొస్తుందనే నమ్మకంతో నిజాం కాలంలో ఇక్కడ అమ్మవారి దేవాలయం ఏర్పాటు చేశారు.
 
 హనుమంతు ఉరఫ్ పోతరాజు..!

 అతను అమ్మవారికి అంగరక్షకుడు. గ్రామదేవతల తోబుట్టువు. వారికి కావలి. ఇదీ పోతరాజు పరిచయం. అదంతా కథల్లోనే.. కానీ పాతబస్తీ  ప్రజలకు ఎనిమిది దశాబ్దాలుగా తెలిసిన పోతరాజు మాత్రం హనుమంతే. నిలువెత్తు విగ్రహం, చక్కని శరీర సౌష్ఠవం.. కోర మీసాలు, జులపాల జుత్తు.. పెద్ద కళ్లు. భీతి గొలిపే రూపం.. మెడలో నిమ్మకాయల హారం. ఒంటినిండా పసుపు.. నుదుటిన పొడవాటి కుంకుం బొట్టు. చేతిలో కొరడా.. కాళ్లకు గజ్జెలు. బోనాల ఊరేగింపులో అగ్రభాగాన ఉండి ఎగిరి గెంతులేస్తూ, నృత్యం చేస్తూ జనాన్ని అదిలిస్తూ, బెదిరిస్తూ  ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ ‘పోతరాజు’ చెప్పే వివరాలు ఆయన మాటల్లోనే...
 
 మూసీనదికి వరదలొచ్చినప్పుడు పుట్టిన్నట.. మాయమ్మ చెప్పింది. ఆ వరదలు ఊర్ని ముంచెత్తుతా ఉంటే నన్నెత్తుకొని గంగబాయి గుట్ట మీదకు పరుగెత్తిందట. ఒక చింతచెట్టెక్కి ప్రాణాలు దక్కించింది. నా పుట్టుక గురించి నాకు తెలిసింది ఇంతే. మాయమ్మ పేరు నర్సమ్మ. నాయిన రామన్న. చిన్నప్పటి నుంచి ధూల్‌పేట్‌లోనే.  మా పెద్దనాయిన నర్సింహ్మ. చెట్టుమీదికెక్కి సిగాలు ఊగేవాడు. మా పెద్దనాయిన నీడ నాకు (దేవత ఆవహించింది) పడింది. అప్పుడు నాకు పదిహేనేళ్లు. మస్తు బలంగా ఉండేవాణ్ణి. గోకుల్‌ప్రసాద్ అనే పూజారి నాతో తొలిసారి పోతరాజు వేషం వేయించిండు. ఇప్పటి వరకు ఆ ఆచారాన్ని తప్పలేదు. పురాణాపూల్, మంగల్‌హాట్, ధూల్‌పేట, గౌలిగూడ, గోడీ కీ కబర్, జిన్సీ చౌరాయి.పాతబస్తీలో ఎక్కడ బోనాల పండుగైనా  పరుగెత్తుకొని పోయిన. అప్పట్లో  యాటను (మేకపోతును) గావు (గొంతు కొరికేయడం) పట్టేవాణ్ణి.అమ్మవారి పండుగొచ్చిందంటే  నాకు నిమిషం తీరిక ఉండేది కాదు. పూరానాపూల్‌లో మహంకాళమ్మ గుడి కట్టించిన. యాదగిరిగుట్ట నుంచి గాంధీ బొమ్మ తెప్పించి ఇక్కడ పెట్టించింది కూడా నేనే.
 
 ఎన్నెన్నో అపురూప ఘట్టాలు మహంకాళి జాతరలో  అనేక అపురూపమైన ఘట్టాలుంటాయి.  ఈ నెల 29వ తేదీన ఘటాల ఎదుర్కోలుతో  వేడుకలు  ప్రారంభమవుతాయి. జాతర సందర్భంగా  సికింద్రాబాద్  జనసంద్రాన్ని  తలపిస్తుంది. పుట్టింటి నుంచి వచ్చే అమ్మవారికి  ఘటం తో స్వాగతం పలుకుతూ తోడ్కొని వచ్చేదే ఘటోత్సవం. ఆలయం నుంచి  పసుపు, కుంకుమ,పూలను తీసుకెళ్లి కర్బలమైదాన్‌లో  ఘటాన్ని అలంకరిస్తారు.  వెదురు దబ్బల మధ్యలో రాగి చెంబు ఉంచి, అమ్మవారి వెండి విగ్రహాన్ని పెడతారు. అలా ఊరి పొలిమేర నుంచి బయలుదేరిన తల్లి భక్తజనం నడుమ ఆలయానికి విచ్చేస్తుంది. 9 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తుంది. బోనాల చివరి రోజు జరిగే అంబారీ ఊరేగింపుతో తల్లిని సాగనంపుతారు.
 
 కుస్తీలకూ పోయేవాణ్ని...
 ఆ రోజుల్లో లాల్ పహిల్వాన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న. కుస్తీపోటీలకు పోయేవాణ్ని. గద్వాల్ మహారాణి దగ్గర కూడా పోటీలల్ల పాల్గొన్నం. బతికినన్ని రోజులు బాగానే బతికిన. నవాబులకు కూడా క్షవరాలు చేసిన. ‘సర్కార్ క్యా హై’ అంటే చాలు చేతికి ఎంతొస్తే అంత డబ్బు ఇచ్చే వాళ్లు. నాకు ఇద్దరు భార్యలు కమలమ్మ, యాదమ్మ. కమలమ్మ చనిపోయింది. ఇద్దరికీ కలిపి 15 మంది పిల్లలు. వారిని నేనూ, యాదమ్మ సాది పెంచి పెద్ద జేసినం. చాలా కష్టపడ్డం. కడుపు మాడ్చుకొని బతికినం. కానీ ఏం లాభం. అంతా చెట్టుకొకలు, పుట్టకొకలు  పోయిండ్రు.హైదరాబాద్‌ల ఎవ్వరు ఎక్కడ ఉంటండ్రో తెల్వదు. నా పెద్దకొడుక్కే 75 ఏళ్లు ఉంటది. ఎంతమంది పిల్లలు ఉంటే మాత్రం ఏమైంది. నా బతుకు నేనే బతకుతున్నా. పిల్లలకు మంత్రం వేయమని నా దగ్గరకొస్తరు. పైసో,ఫలమో ఇస్తరు. ఆ డబ్బులతోనే బతుకుతున్న...’ అని ముగించాడు హనుమంతు.  
 
 ఉజ్జయినీ మహంకాళి రంగం చెప్పడానికి ముందుగా పెళ్లి (మాంగల్యధారణ) జరగాల్సి ఉంది. అందరికీ జరిగే పెళ్లిలాగే నాకూ జరిగినా పెళ్లి కొడుకు ఉండడు. ఖడ్గంతో నాకు మాంగల్యధారణ చేయించి ఆ తంతు పూర్తి చేశారు. నాటి నుంచి నా జీవితం అమ్మవారికే అంకితమైంది. అలా పదహారేళ్లుగా భవిష్యవాణి వినిపిస్తున్నా.
  ఆదివారం బోనాలు సమర్పించడం పూర్తికాగానే సోమవారం  రంగం ఏర్పాట్లుంటారుు. ఆ రోజు తెల్లవారు జామునే లేచి స్నానం చేసి దుస్తులు ధరించి ఆలయానికి వస్తా. రోజంతా ఉపవాసమే. ముఖానికి పసుపు రాసుకుంటా.మహంకాళి  ఎదురుగా ఉండే మాతంగేశ్వరీ ఎదురుగా పచ్చి కుండపై నన్ను నిలబెడతారు.అప్పుడు అమ్మవారు నన్ను ఆవహిస్తారు.
 
 అటు తర్వాత  ఏం జరిగిం దనేది నాకు గుర్తుండదు. టీవీల్లో  చూసి అసలు నేనేనా ఇదంతా చెప్పిందనిపిస్తుంది. అవ్మువారి సేవకు అంకితమైన నాకు కుటుంబం, పిల్లలు వంటి ఆలోచనలు ఉండవు. ఆలయం నుంచి కొన్నేళ్లుగా నెలకు రూ.3వేలు వస్తున్నాయి. నా జీవనం కోసం కుట్టు పనిచేస్తుంటా. ప్రతి శుక్ర, మంగళవారాల్లో అమ్మవారి దేవాలయానికి వచ్చి ముత్తయిదువులకు పసుపు కుంకుమ అందిస్తుంటా.
 తొలుత మా పూర్వీకురాలు జోగమ్మ భవిష్యవాణి వినిపించేది. అటు తర్వాత బాలమ్మ, పోచమ్మ, మా నాన్నమ్మ బాగమ్మ, మా అక్క స్వరూపరాణి దాన్ని కొనసాగించారు.  ఐదు తరాల నుంచి మేవుు తల్లిసేవలో కొనసాగుతున్నాం.     
 -     దార్ల వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement