అమ్మా బెలైల్లినాదో.. | bonalu festival in mumbai | Sakshi
Sakshi News home page

అమ్మా బెలైల్లినాదో..

Published Sat, Jul 5 2014 11:35 PM | Last Updated on Mon, Aug 20 2018 5:39 PM

అమ్మా బెలైల్లినాదో.. - Sakshi

అమ్మా బెలైల్లినాదో..

- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా  బోనాల పండుగ
- కిటకిటలాడుతున్న పోచమ్మ మందిరాలు
సాక్షి, ముంబై : రాష్ట్రవ్యాప్తంగా పోచమ్మ పండుగలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రాంతాల్లో మాదిరిగానే ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసం నుంచి తెలుగువారు ఈ పోచమ్మ పండుగను ఎన్నో యేళ్లుగా జరుపుకుంటున్నారు. కామాటిపురాలో చాలా యేళ్ల కిందటే పోచమ్మ గుడిని నిర్మించి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం కామాటిపురాతోపాటు వర్లీ, దాదర్, బోరివలి, ఘాట్కోపర్, ఠాణే, భివండీ, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో పోచమ్మ గుడులు వెలిశాయి. ఈసారి ఆషాఢ మాసం జూన్ 27వ తేదీన ఆషాఢ అమావాస్యతో ప్రారంభంకాగా జూలై 26వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో అందరికీ సెలవు దినాలైన జూలై 6, 13, 20 తేదీల్లో పెద్ద ఎత్తున పోచమ్మ ఆలయాల్లో భక్తుల రద్దీ కన్పించనుంది. వర్షాకాలంలో వచ్చే కలరా, ప్లేగు, మశూచి వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరుగకుండా, పాడిపంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని పోచమ్మతల్లిని వేడుకుంటూ బోనాల పండుగను నిర్వహిస్తారు.

పోచమ్మ పండుగ సందర్భంగా కొందరు పోచమ్మ దేవికి బోనాలు సమర్పించగా, మరికొందరు జంతుబలిని ఇస్తారు. ఆషాఢ మాసంలో పోచమ్మతల్లి పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే తమ కూతుళ్లు పుట్టింటికివస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్లే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి నైవేద్యం సమర్పించి భక్తిని చాటుకుంటారు. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే తెలుగు వారి పండుగ కావడంతో భక్తులు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు.

ముంబైలో ఈ పండుగను ఒకే రోజు కాకుండా జ్యేష్ట మాసం ముగిసిన అనంతరం శ్రావణం ప్రవేశించక ముందే వీలున్న రోజుల్లో, సెలవు దినాల్లో బంధుమిత్రులను ఆహ్వానించి ఘనంగా జరుపుకుంటారు. శ్రావణంలో ఉపవాసాలు మొదలవుతాయి కాబట్టి పోచమ్మ ఉత్సవాలు ఈ మాసానికి ముందే ముగుస్తాయి. పోచమ్మ తల్లికి సమర్పించే సామగ్రిలో టెంకాయలు, పసుపు-కుంకుమ, పూలు, ఫలాలు, పాలతోపాటు బెల్లం లేదా పంచదారతో కలిపి వండిన ప్రత్యేకమైన పరమాన్నం ఉంటాయి. వీటిని ఒక పాత్రలో పెట్టి, ప్రమిద వెలిగించి తీసుకొస్తారు. పోచమ్మకు భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పిస్తారు. అదేవిధంగా సంప్రదాయంగా వస్తున్న జంతుబలి(కోళ్లు, మేకలు)ని సైతం కొనసాగిస్తున్నారు.
 
బోరివలిలో ఘనంగా ‘బోనాలు’
బోరివలి, న్యూస్‌లైన్: నగరంలో తెలుగు ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తూర్పుబోరివలిలోని హనుమాన్ నగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం సాయంత్రం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్‌లో కొలువైన పోచమ్మ తల్లికి  సంఘం అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ నేతృత్వంలో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని పలు వీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్లారు.

ఎస్పీ రోడ్ నుంచి కార్టన్ రోడ్ నం-2లో నుంచి గావ్‌దేవి మందిరం వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అమ్మవారికి మహిళలు నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడూతూ.. 1976లో బోనాల పండుగను ముంబైలో ప్రారంభించామన్నారు.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. అక్కడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పండగగా బోనాలను ప్రకటించడంతో ఈ ఏడాది బోనాలను చాలా ఘనంగా నిర్వహించామని గంగాధర్ తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, గాజుల నర్సారెడ్డి, నీరటి భూమన్న, సేకుట పోచవ్వ, భూమల్ల గంగవ్వ, అదరవేని కుంటమల్లు, అవురకొండ నర్సవ్వ, లంబ లింగవ్వ, దేశవేని రవి, ఇడుగునూరి రాాజవ్వ, జయ సుతార్, సాయిల గంగవ్వ, వేగుర్ల లక్ష్మి, అదరవేని పద్మ, పెద్ద పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement