సాక్షి, హైదరాబాద్: ‘చుట్టూ రాజభటులు.. మధ్యలో ముజ్రా నృత్యాలు.. ఒకవైపు నౌబత్ సంగీత వాద్యం.. మరోవైపు ఖవ్వాలీ బృందగానం.. ఇంకోవైపు షెహ్రీ బాజా.. మధ్యమధ్యలో పేరిణి శివతాండవం.. చిందు యక్షగానం.. కొమ్ము కోయ, గుస్సాడి, బంజారా, డప్పు నృత్యాలు.. ఒగ్గుడోళ్ల విన్యాసాలు.. కంచు బూరలు.. ఇంకా మంద హెచ్చుల కథలు...’.. స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ఆవిష్కృతమైన దృశ్యమిది. నాటి నవాబుల దర్పానికి అద్దం పట్టేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఇలాంటి దృశ్యాలెన్నో శుక్రవారం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న వారికి కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత గోల్కొండ కోటలో తొలిసారి నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.
అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొద్ది మందికే ఆహ్వానం ఉండటంతో... మిగతా వారంతా కోట బయట నిలుచుని వీక్షించేందుకు ప్రయత్నించారు. ఇక కోట లోపలికి వచ్చిన వారంతా ఉదయం నుంచే ప్రారంభమైన జానపద నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలను కళ్లార్పకుండా తిలకించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం పరేడ్ మైదానానికి వెళ్లి సైనిక అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అటు నుంచి నేరుగా గోల్కొండ కోటకు బయలుదేరారు.
సీఎం కాన్వాయ్ గోల్కొండ కోటలోకి ప్రవేశించగానే కోట చుట్టూ రాజభటుల వేషధారణలో ఉన్న కళాకారులు తలవంచి నమస్కారం చేయగా.. డప్పులు, సంగీత వాద్యాలు, కంచు బూరలతో మరికొందరు కళాకారులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ సైతం ఉత్సాహంగా అందరికీ అభివాదం చేస్తూ రాణిమహల్ వద్దకు చేరుకున్నారు. ఆయన రాగానే అక్కడున్న విద్యార్థులంతా ‘జై తెలంగాణ, జైహింద్’ అని నినదిస్తూ త్రివర్ణాల బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం సీఎం సరిగ్గా 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం కేసీఆర్ బయలుదేరుతుండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన కాన్వాయ్ వద్దకు వచ్చారు.
వారిని నిలువరించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. మరోవైపు అదే సమయంలో మజ్లిస్ నాయకులంతా రాణిమహల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చి ఎంఐఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ సతీమణితోపాటు కుమార్తె, అల్లుడు కూడా హాజర య్యారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులంతా గోల్కొండ కోటకు తరలివచ్చారు.
అంతా నవాబుల స్టైల్!
Published Sat, Aug 16 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement