లాక్‌డౌన్‌ ఎత్తేస్తే? | Telangana CM Goes For Personal Survey To Lockdown Relaxation | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఎత్తేస్తే?

Published Tue, May 5 2020 1:42 AM | Last Updated on Tue, May 5 2020 7:59 AM

Telangana CM Goes For Personal Survey To Lockdown Relaxation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నివారణకు వ్యాక్సిన్, మందు ల్లేవు. దాన్ని కట్టడి చేయడం ఒక్కటే మార్గం. అందుకే ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలవుతోంది. అయితే అదొక్కటే పరిష్కారం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్‌తో సాధారణ జనజీవనం స్తంభించింది. ఉపాధి అవకాశాల్లేక బతుకుదెరువు ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంపైనా, కొన్ని సడలింపులిచ్చి కొనసాగించడంపైనా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా సడలింపులిచ్చి లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ‘లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఎలా ముందుకు వెళ్లాలి’అనే దానిపై ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎస్‌ఎం) ఇటీవల ఒక నివేదిక తయారుచేసింది. దాన్ని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అధ్యయనం చేశారు. దీని ఆధారంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసినా, సడలింపులిచ్చినా ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే తలెత్తే పరిణామాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిని నివేదికలో ప్రస్తావించారు.

వైరస్‌ కట్టడికి సమగ్ర వ్యూహం అవసరం
ఐఏపీఎస్‌ఎం నివేదికలో పేర్కొన్న ప్రకారం.. ‘ప్రజల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ (జనబాహుళ్యం మొత్తానికి రోగ నిరోధక శక్తి) పెరగాలంటే 60% మందికి వైరస్‌ వ్యాప్తి చెందాలి. అప్పుడే వైరస్‌ తీవ్రత తగ్గి నెమ్మదిస్తుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుతుంది. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల్లో పరిమితులు విధించకపోతే అందరికీ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఫలితంగా పెద్దసంఖ్యలో మరణాలు సంభవిస్తాయి. బ్రిటన్‌ అటువంటి తప్పుచేసి నష్టపోయింది. కరోనా వైరస్‌ తక్కువ వయసుగల వారికి సోకితే పెద్ద ప్రమాదం లేదు. వారికి అది తేలికపాటి వ్యాధిలాంటిదే. కానీ 60 ఏళ్లకు మించిన వారికి సోకితే మరణాలు సంభవిస్తాయి.

యువకులు వైరస్‌కు గురైతేనే మొత్తం జనాభాలో సామూహిక రోగనిరోధక శక్తి క్రమంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాక, కరోనాను పారద్రోలాలంటే పరిమిత సడలింపులతో పాటు కేసుల స్క్రీనింగ్, నిర్వహణ కోసం బలమైన ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. వచ్చే శీతాకాలంలో కరోనా కేసులు మరింత పెరగొచ్చు. కాబట్టి తగిన ప్రణాళిక, సంసిద్ధత అవసరం. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి. రాబోయే రోజుల్లో కరోనా కేసులను సమర్థవంతంగా ఎదుర్కోడానికి పీపీఈ, డయాగ్నస్టిక్‌ కిట్లు, వెంటిలేటర్లను ఎక్కువగా ఉత్పత్తి చేయాలి’. చదవండి: రూ.5 కోట్ల విలువైన భూమి రూ.5 లక్షలా..! 

లాక్‌డౌన్‌ ఎత్తివేతకు వ్యూహాలు
ఇప్పటికే ఉన్న ఆసుపత్రులు, కొత్త ఆసుపత్రుల్లో కరోనా కేసుల నిర్వహణ సామర్థ్యాన్ని విస్తరించాలి.
అంటువ్యాధుల పెరుగుదలను నివారించడానికి వైరస్‌ వ్యాప్తి వేగాన్ని తగ్గించాలి.
వైద్య సిబ్బందిపై అధిక భారాన్ని తగ్గించాలి. వారిని కాపాడుకోవాలి.
వైరస్‌ సామాజిక వ్యాప్తిని నిరోధించేందుకు కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలి.
ప్రజల సాధారణ ఆరోగ్య అవసరాలను ఏకకాలంలో తీర్చాలి.
అవసరమైన వస్తువుల తయారీ, జీవనోపాధి కల్పన, ఆర్థిక వ్యవస్థను క్రమంగా పునరుద్ధరించడం చేయాలి.

లాక్‌డౌన్‌ తర్వాత ఏం చేయాలంటే?
లాక్‌డౌన్‌ ఎత్తివేశాక లేదా సడలింపులిచ్చాక ఏం చేయాలనే దానిపై కొన్ని సాధారణ ప్రొటోకాల్స్‌ను నివేదిక ప్రస్తావించింది. అవి..
వైరస్‌ లింక్‌ను విచ్ఛిన్నం చేయడానికి భౌతికదూరం పాటించడం తప్పనిసరి. భౌతికదూరం కనీసం రెండు మీటర్లు ఉండాలి.
భౌతికదూరాన్ని మార్కెట్‌ ప్రదేశాలు, కిరాణా దుకాణాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యుత్‌ బిల్లు కౌంటర్లు, పోస్టాఫీసులు తదితర చోట్ల అమలుచేయాలి.
వైరస్‌ వ్యాప్తి జరగకుండా చూసేందుకు ఫేస్‌మాస్క్‌ తప్పనిసరి. దీన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలి.
60ఏళ్లు పైబడిన, అలాగే ఇతరత్రా వ్యాధులున్న 50ఏళ్లు పైబడిన వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువ. వీరు ఇంటి నుంచే పనిచేయాలి. వీరి సంఖ్యను లెక్కించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రమం తప్పకుండా పరీక్షించాలి.
పార్కులు, సమావేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్రీడ, సంగీత ప్రదర్శనలు పూర్తిగా నిషేధించాలి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత 60రోజులు లేదా వైరస్‌ మహమ్మారి తగ్గే వరకు వీటిని అనుమతించకూడదు.
అత్యవసర సేవల విషయంలో జిల్లా కలెక్టర్‌ 90రోజుల పాటు పాస్‌లు జారీచేయాలి.
ప్రజారవాణా సదుపాయం కల్పించాలి. భౌతికదూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించే ప్రయాణించాలి. సీటింగ్‌ సామర్థ్యం మించకూడదు. పరిస్థితి తీవ్రంగా ఉన్నచోట ప్రజా రవాణా వాహనాల్లో సీటుకు ఒకరిని మాత్రమే అనుమతించాలి.
అవసరమైన వస్తువుల కోసం ఆన్‌లైన్‌ షాపింగ్‌ను అనుమతించవచ్చు.
ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో లాక్‌డౌన్‌ సమయంలో మాదిరిగానే చర్యలు చేపట్టాలి. జనాన్ని బయటకు రానివ్వకుండా చూడాలి.
వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతివ్వాలి. అలాంటి సందర్భాలలో సమీప బంధువులు హాజరుకావచ్చు.
ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు 50శాతం రోస్టర్‌తో పనిచేయాలి. వారానికి ఐదు రోజుల పని విధానం అమలుచేయొచ్చు.
ప్రైవేటు ఆఫీసుల్లో షిఫ్ట్‌కు 70శాతం ఉద్యోగులనే అనుమతించాలి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువుంటే ఈ సంఖ్యను 50 నుంచి 20 శాతానికి తగ్గించాలి. ఆఫీసుల్లో హ్యాండ్‌ వాషింగ్‌ సౌకర్యం, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
సాధారణ పరిస్థితి వచ్చే వరకు అంతర్జాతీయ, రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజల కదలికలపై పరిమితి విధించాలి.
అంతర్జాతీయ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన తరువాత.. ఏదైనా మార్గం ద్వారా ఎక్కడి నుంచైనా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు జాతీయ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌కు వెళ్లాలి.
కేసుల సంఖ్య, వ్యాప్తి, నిర్వహణ, వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు.. వీటి ఆధారంగా ప్రతి జిల్లాను నాలుగు రకాలుగా వర్గీకరించాలి. ఆ వర్గీకరణ ఆధారంగానే సడలింపులనివ్వాలి.
పరిస్థితిని బట్టి 30 నుంచి 90 రోజుల వరకు ఈ నిబంధనలు కొనసాగించాలి. ఆపై వైరస్‌ వ్యాప్తి తీవ్రతను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement