బీబీనగర్ లో నిమ్స్ మ్యాప్ ను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
* రూ. 1,000 కోట్లతో అభివృద్ధి
* 200 ఎకరాల్లో అభివృద్ధికి నిర్ణయం
* రాజధాని, శివారు జిల్లాల రోగులకు వైద్యసేవలు
* మొదటి దశలో ఎయిమ్స్, రెండో దశలో స్మార్ట్ హెల్త్‌సిటీ
* స్మార్ట్‌హెల్త్‌సిటీ కోసం వెయ్యి ఎకరాలు
* రైతులు, భూదాన్ భూముల సేకరణ
* సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం
భువనగిరి: నల్లగొండ జిల్లా బీబీనగర్ వద్దగల నిమ్స్‌ను ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్)గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మంగళవారం బీబీనగర్ మండలం రంగాపురం వద్దగల నిమ్స్‌ను సీఎం పరిశీలించారు. అంతర్జాతీయస్థాయిలో హెల్త్ టూరిజం, హెల్త్‌స్మార్ట్ సిటీగా బీబీనగర్ నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు అధికారులతో కలసి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా అభివృద్ధి చేయడానికి 200 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం 160 ఎకరాల భూమి ఉంది. మిగిలిన 40 ఎకరాలను రైతులు, భూదాన్ భూముల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఈ భూమి ప్రతిపాదనలతో కేంద్రానికి నివేదికలు పంపిస్తే ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తారని సీఎం వివరించారు. ఎయిమ్స్ ఏర్పాటైతే సుమారు 1,000 కోట్ల నిధులు కేంద్రం నుంచి రానున్నాయి.
నిమ్స్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల రోగులకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటు వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అధునాతన రీసెర్చ్ సెంటర్లను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తెలంగాణలో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. దీంతో ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కోరారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్రంలోని 10 ప్రాంతాలను ఎంపికచేసి అనువైన స్థలం కోసం సర్వేలు చేపట్టింది. అంతిమంగా బీబీనగర్ నిమ్స్.. ఎయిమ్స్ ఏర్పాటుకు అనువైందని గుర్తించింది. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా నిమ్స్‌ను సందర్శించి ఎయిమ్స్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
1,000 ఎకరాలు సేకరించాలి
నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చడానికి ప్రస్తుతం 200 ఎకరాలు అవసరం కాగా, అంతర్జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన కేంద్రంగా, స్మార్ట్ హెల్త్‌సిటీగా అభివృద్ధి చేయడానికి మాత్రం 1,000 ఎకరాల స్థలం అవసరమవుతుంది. ఇందుకోసం బీబీనగర్ ప్రాంతంలో ఉన్న భూదాన్ భూములను సేకరించాలని నిర్ణయించారు. మొదటి ఫేజ్‌లో 200 ఎకరాల్లో ఎయిమ్స్‌ను, రెండవ ఫేజ్‌లో 1,000 ఎకరాల్లో స్మార్ట్‌హెల్త్‌సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ, ఆరోగ్యశాఖ డెరైక్టర్ శ్రీనివాస్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ మధుసూదన్ పాల్గొన్నారు.