
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నేతలకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జెడ్ క్యాటగిరీ భద్రతతోపాటు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ కల్పించాలని డీజీపీని కోరారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 4+4 సెక్యూరిటీ కల్పించాలని, భట్టి విక్రమార్కకు ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని పెంచాలని డీజీపీకి వినతిపత్రం అందజేశారు. వారితో పాటు విజయశాంతి, మధుయాష్కి, గూడూరు నారాయణ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌లకు సెక్యూరిటీ కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
డీజీపీని కలిసిన వారిలో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ ఉన్నారు. దీనిపై స్పందించిన డీజీపీ విధివిధానాలకు అనుగుణంగా నేతలకు భద్రతను కొనసాగిస్తామని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాలకు చెందిన 4+4 సిబ్బందితో భద్రత కల్పించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని, రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఈ భద్రతను కొనసాగించాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment