
రాష్ట్రంలో అభివృద్ధి రెపరెపలు
అన్ని రంగాల్లో పురోగమిస్తోంది: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ‘‘పేదరికం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. సమాజంలోని బడుగు బలహీన వర్గాల్లోని నిరుపేదల సమ్మిళిత అభివృద్ధినే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుంది. పారదర్శక, సమర్థవంతమైన పాలన ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు స్థాయి వరకు చేరుతాయని ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోంది. అందుకే ఇక్కడి విధానాలు, కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి..’’ అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. గడిచిన 21 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ఎంచుకున్న లక్ష్యాలు ప్రాధామ్యాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందం చేసుకోవటంతో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించిందని అన్నారు. ఆచరణాత్మక దృక్పథంతోపాటు రాజ నీతిజ్ఞతను ప్రదర్శించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నిర్ణీత సమయం 11 గంటల కంటే ఐదు నిమిషాల ముందే సభ ప్రారంభమైంది. 25 నిమిషాల పాటు ప్రసంగించిన గవర్నర్.. ‘‘ప్రజాప్రతినిధులు అంకిత భావంతో ఆచరణాత్మక కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ మార్గదర్శకంగా ఉండాలి..’’ అనే సందేశంతో ముగించారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ..
అన్ని రంగాల్లో పురోగతి
అన్ని రంగాల్లోనూ రాష్ట్రం పురోగతిని సాధించింది. కొత్త పథకాలు, విధానాలతో దేశంలోనే అగ్రగామిగా నిలబడేందుకు కృషి చేస్తోంది. జాతీయ వృద్ధి రేటు 8.6 శాతం కాగా.. ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 2015-16లో 11.7 శాతానికి చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఇదో ముఖ్యమైన మైలురాయి. 2016-17లో జీఎస్‌డీపీలో 15 శాతం అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా ఎంచుకుంది. జాతీయ తలసరి ఆదాయం రూ.93,231 తో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 2014-15లో రూ.1,29,182 నుంచి రూ.1,43,023కు పెరిగే అవకాశముంది. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న కల్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలకు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర తరగతులకు విస్తరించనుంది. మైనారిటీలకు కొత్తగా 70 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మానవీయ కోణంలో ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని కాలేజీ విద్యార్థులకు విస్తరించనుంది.
టీఎస్‌ఐపాస్ భేష్..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. ఎనిమిది నెలల వ్యవధిలో ప్రముఖ కార్పొరేట్ గ్రూపుల యూనిట్లతోపాటు వందకుపైగా యూనిట్లకు అనుమతులిచ్చింది. కొత్తగా మూడు ఏరోస్పేస్ పార్కులను ఏర్పాటు చేయనుంది. ఫార్మాసిటీ ఏర్పాటు దిశగా పురోగతి సాధించింది. వచ్చే ఏడాది మెదక్‌లో ఎన్‌ఐఐజెడ్ (జాతీయ పెట్టుబడి, తయారీ జోన్) ఒకటో దశ ప్రారంభం కాబోతోంది. వరంగల్‌లో భారీ జౌళి పార్కు, జౌళి రంగంలో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది.
నగరం వైపు ఐటీ దిగ్గజాల చూపు
కొత్త ఐసీటీ విధానంతో ప్రపంచ ఐటీ దిగ్గజాలు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. నాలుగు అత్యున్నత ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత హైదరాబాద్‌లో భారీ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాయి. యువతకు ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి వీలుగా ప్రభుత్వం టీ-హబ్, తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్ (టాస్క్)లను ఏర్పాటు చేసింది. దేశంలోనే అత్యంత అనుకూల పారిశ్రామిక గమ్యస్థానంగా తెలంగాణ ఉద్భవిస్తోంది. 2015-16లో రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం 11 శాతానికిపైగా పురోభివృద్ధి సాధించింది.
జిల్లాల్లోనూ షీ టీమ్స్
శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం పోలీసు శాఖను ఆధునీకరించింది. హైదరాబాద్‌లో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ప్రపంచ శ్రేణి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. 2014తో పోలిస్తే 2015లో నగరంలో నేరాల రేటు 14 శాతం మేర తగ్గింది. మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు హైదరాబాద్‌లో ప్రవేశపెట్టిన షీ టీమ్‌లను జిల్లాలకు విస్తరింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
108 ఇక మరింత పటిష్టంగా
ఆరోగ్యరంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులను సమకూర్చనుంది. హైదరాబాద్‌లో నాలుగు కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రారంభించనుంది. 108 పథకానికి ఆధునిక ప్రాణ రక్షణ పరికరాలున్న మరిన్ని వాహనాలను చేర్చి పటిష్టపరచనుంది. 2016 సంవత్సరాన్ని నవజాత శిశువుల సంవత్సరంగా ప్రకటించిన ప్రభుత్వం శిశు మరణాల రేటు (ఐఎంఆర్)ను తగ్గించే చర్యలు ప్రారంభించింది. గ్రామ పంచాయతీలకు సాధికారత కల్పించేందుకు గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభించింది. పచ్చదనం, పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ‘స్వచ్ఛ భారత్’ చేపట్టబోతోంది.
కొత్తగా 15,000 కి.మీ. రోడ్లు
హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు ఫోర్ లైన్ల రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు డబుల్ లైన్ల రోడ్లు, 358 కొత్త వంతెనలతో సహా మొత్తం 15,000 కిలోమీటర్ల పొడవు రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 1,650 కి.మీ.ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చింది.
పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
పేదలు గౌరవప్రదంగా జీవించేందుకు, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు సింగిల్ బెడ్‌రూం గృహాల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అర్హులైన కుటుంబాలన్నింటికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారి వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. పది జిల్లాల్లో ఇప్పటికే 60 వేల గృహాలను మంజూరు చేసింది. 2016-17లో జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో మరో లక్ష ఇళ్లను నిర్మించనుంది.
ప్రతి ఇంటికీ నల్లా నీరు
ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించే మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 6,100 గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు నీటి సరఫరా లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ప్రతి కుటుంబానికి ఫైబర్ కేబుల్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానం చేయనుంది. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. మొదటి దశలో ఆరు వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండో దశలో 9 వేల చెరువుల పనులు చేపట్టనున్నారు.
ఈ ఏడాదితో 75 శాతం రుణమాఫీ..
రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రుణమాఫీకి దశలవారీగా బ్యాంకులకు రూ.17,500 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాదితో 75 శాతం రుణమాఫీ పూర్తవుతుంది. వ్యవసాయ యంత్రాలకు, పరికరాలకు 50 శాతం సబ్సిడీ సమకూరుస్తోంది. సూక్ష్మసేద్యం సబ్సిడీని అన్ని వర్గాల రైతులకు ఒక హెక్టారు నుంచి అయిదు హెక్టార్లకు విస్తరించింది. పాలీహౌస్ ద్వారా కూరగాయలు, పూల సాగును ప్రోత్సహిస్తోంది. దీనికి 75 శాతం సబ్సిడీ సమకూరుస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతుల పాలీహౌజ్ వినియోగాన్ని పెంచేందుకు 95 శాతం సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన అయిదు శాతాన్ని సబ్‌ప్లాన్ నుంచి సాయంగా అందిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యానవన పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు వీలుగా తెలంగాణ ఉద్యానవన అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనుంది.
వచ్చే ఏడాదికల్లా నిరంతర విద్యుత్
అంతరాయం లేని, నాణ్యమైన విద్యుత్‌ను అందించటం అద్భుతమైన విజయం. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 2016-17లో నిరంతర విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఉత్తమమైన సౌర విధానాన్ని రూపొందించింది. రాబోయే మూడేళ్లలో స్థాపిత సామర్థ్యాన్ని 23,912 మిలియన్ యూనిట్లకు తెచ్చే అభ్యుదయ కార్యక్రమం చేపట్టింది. కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన భూమి, క్లియరెన్స్‌లు పొందే ప్రక్రియ కొనసాగుతోంది.
కోటి ఎకరాలకు నీరే లక్ష్యం
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఉద్దేశించిన భారీ సాగునీటి ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర వివాదాలు, అటవీ అనుమతుల సమస్యలతో కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీలైనంత త్వరలో కోటి ఎకరాలకు పైగా సాగు నీటిని అందించే లక్ష్యం ఎంచుకుంది. ప్రతి రైతు పొలానికి నీటిని అందించాలనే సంకల్పం సాగునీటి రంగంలో మైలురాయిగా నిలుస్తుంది. మారిన అవసరాలకు అనుగుణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, భక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు, మల్లన్నసాగర్, కొండా పోచమ్మ సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది.