
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా తెలంగాణను నియంత రాజ్యంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకోవడం ద్వారా కేసీఆర్ శాసనవ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారని నిర్ధారణ అయిందన్నారు. 2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన 25 మంది ఎమ్మెల్యేలు, రెండు డజన్ల మంది ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇచ్చిన పిటిషన్‌లను స్పీకర్, మండలి చైర్మన్‌లు పట్టించుకోలేదని శనివారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దయ కోసం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోని ఆ ఇద్దరూ రాజ్యాంగాన్ని మోసగించిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు శాసన వ్యవస్థ పట్ల గౌరవం లేదని పేర్కొన్నారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వచ్చినా ఇప్పటివరకు కేబినెట్‌ను ఏర్పాటు చేయకపోవడం, గెలిచిన ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.