‘మహా’ ముడి వీడితేనే..!? | Telangana Election Grand Alliance Karimnagar | Sakshi
Sakshi News home page

‘మహా’ ముడి వీడితేనే..!?

Nov 10 2018 7:59 AM | Updated on Nov 10 2018 7:59 AM

Telangana Election Grand Alliance Karimnagar - Sakshi

మహాకూటమి సీట్ల సర్దుబాటు, స్థానాల కేటాయింపుపై చిక్కుముడి వీడటం లేదు. రోజుకో రకమైన లీకులతో మహాకూటమి భాగస్వామ్య పార్టీల కేడర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీలలో విడివిడిగా, భాగస్వామ్య పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన కూటమి పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. టీపీసీసీ నుంచి పొన్నం ప్రభాకర్, సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ సీట్ల సర్దుబాటు, కేటాయింపుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 స్థానాలలో కూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించే స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. రోజుకో రకమైన ప్రచారాన్ని తెరమీదకు తెస్తుండటంతో సుమారు రెండు నెలలుగా సాగుతున్న గందరగోళానికి తెరపడకపోగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు పీటముడిగా మారింది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌ రెండు, టీటీడీపీ, సీపీఐలు తలా ఒక స్థానాలను ప్రస్తుతం డిమాండ్‌ చేస్తున్నాయి. అంతకంటే ఎక్కువ సీట్లే అడిగినా.. చివరి నిమిషంలో ఈ సంఖ్యతో సరిపెట్టుకునేందుకు మెట్టు దిగాయి. అయితే.. హుస్నాబాద్‌ నియోజకవర్గం విషయంలో మాత్రం సీపీఐ అస్సలు రాజీ పడటం లేదు. 12 నుంచి ఎనిమిదికి, ఎనిమిది స్థానాల నుంచి ఐదుకు తగ్గిన సీపీఐ హుస్నాబాద్‌ను మాత్రం వదులుకోబోమని స్పష్టం చేస్తోంది. తాజాగా శుక్రవారం మరోమారు అత్యవసర రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసిన ఆ పార్టీ నాయకత్వం ఐదు స్థానాలు, హుస్నాబాద్‌పై అమీతుమీ తేల్చుకుంటామనే ప్రకటించాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదే విధంగా టీజేఎస్‌ రామగుండం, హుజూరాబాద్‌ స్థానాలను అడుగుతుండగా.. రామగుండంపై సానుకూలంగా ఉన్నట్లు చెప్తున్నారు.

అయితే.. తాజాగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌ జనగాం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం లేవడంతో, రామగుండం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ సైతం సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్నారు. టీటీడీపీ మొదట హుజూరాబాద్‌ ఆ తర్వాత కోరుట్లను ప్రతిపాదించినా.. చివరకి ధర్మపురికి చేరింది. ఆ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న అడ్లూరు లక్ష్మణ్‌కుమార్, డాక్టర్‌ కవ్వంపెల్లి సత్యనారాయణ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ప్రకటించే అభ్యర్థుల తొలిజాబితా శనివారానికి వాయిదా వేశారు. శనివారమైనా ప్రకటిస్తారా? అన్న సందిగ్ధంలో ఆశావహులు ఉన్నారు.

సింగిల్‌నేమ్‌పై చిర్రు బుర్రు.. ఊగిపోతున్న కాంగ్రెస్‌ ఆశావహులు..
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. చొప్పదండి ఒక్క స్థానంలో సస్పెన్స్‌ పెట్టింది. ఈ 12 నియోజకవర్గాలతోపాటు చొప్పదండి అభ్యర్థికి ఆదివారం సాయంత్రం 4 గంటలకు ‘బి’ఫామ్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నుంచి అందరికీ ఆహ్వానం కూడా అందింది. కాంగ్రెస్, మహాకూటమిల పొత్తులు, అభ్యర్థుల ప్రకటనపై మాత్రం సస్పెన్స్‌ వీడటం లేదు. దీనికి కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ, స్క్రీనింగ్‌ కమిటీలు ఏఐసీసీకి సింగిల్‌నేమ్‌ పంపడంపై ఆ పార్టీ ఆశావహులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

మంథని, జగిత్యాల, సిరిసిల్ల, మానకొండూరు, కరీంనగర్‌ మినహా అంతటా అసంతృప్తులు, ఆశావహులు ఆగ్రహంతో ఉన్నారు. వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్‌ పేరు పంపారన్న ప్రచారంతో ఏనుగు మనోహర్‌రెడ్డి, కొలగాని మహేష్‌ తదితరులు అసంతృప్తిగా ఉన్నారు. చొప్పదండిలో ఓయూ జేఏసీ నేత డాక్టర్‌ మేడిపల్లి సత్యం పేరు ఒక్కటే ఉండటంతో సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం, బండ శంకర్, నాగి శేఖర్‌ తదితరులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.

హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డి పేరు ఒక్కటే పంపడంపై జమ్మికుంట ఏఎంసీ మాజీ చైర్మన్‌ తుమ్మేటి సమ్మిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేష్, స్వరం రవి, పరిపాటి రవీందర్‌రెడ్డి తదితరులు ఆగ్రహంతో ఉన్నారు. పెద్దపల్లిలోని సీహెచ్‌ విజయరమణారావును సూచించడంపై ఈర్ల కొంరయ్య, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు గీట్ల సవితారెడ్డి, గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి తదితరులు ‘కిం కర్తవ్యం? అన్న ఆలోచనలో పడ్డారు. రామగుండం, కోరుట్ల, ధర్మపురిలలో ఇదే పరిస్థితి నెలకొనడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజకీయ సమీకరణలు కూడా మారుతాయన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement