సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపిన గులాబీ దళపతి టిక్కెట్ల కేటాయింపులో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 105 అసెంబ్లీ టిక్కెట్లను ప్రకటించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిలో కేవలం ఇద్దరిని మాత్రమే మార్చారు. మెదక్ జిల్లా ఆందోల్‌లో సినీనటుడు బాబూమోహన్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలుకు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కలేదు.
చెన్నూర్‌లో ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం ఇచ్చిన కేసీఆర్.. మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లిచ్చారు. నలుగురైదుగురికి తప్ప సిట్టింగులందరికీ సీట్లిస్తానని చెబుతూ వచ్చిన ఆయన ముందుగా ఊహించిన విధంగానే చెన్నూర్‌లో ఓదెలుకు చెక్ పెట్టారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒకరిద్దరిని మారుస్తారని ప్రచారం జరిగినా, ఓదెలుకు మినహా అందరికీ సీట్లిచ్చి ప్రతిపక్షాలను, రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశారు.
చెన్నూర్ విషయంలో ఏడాదిగా సందిగ్ధతే!
2013లో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చి 2014లో తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీ మంత్రి గడ్డం వినోద్ 2017లో మరోసారి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వివేక్ సోదరులు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి చెన్నూర్ సీటు విషయంలో పలు అపోహలు చోటు చేసుకున్నాయి. గతంలో మంత్రిగా వినోద్ ప్రాతినిథ్యం వహించిన చెన్నూర్ సీటును వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఇస్తారనే ప్రచారం జరిగింది. పెద్దపల్లి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో వివేక్ పోటీ చేస్తే బాల్క సుమన్‌కు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే గత రెండు నెలల్లో పరిణామాలు మారిపోయాయి. వివేక్‌కు ఎంపీ సీటును ఖాయం చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. వినోద్‌కు మొండిచెయ్యి చూపారు. అదే సమయంలో బాల్క సుమన్‌కు చెన్నూర్ సీటును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఆ సమాచారం జిల్లా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేశారు. సుమన్ సైతం తాను మంచిర్యాల జిల్లా నుంచే రాజకీయాల్లో ఉంటానని ఇటీవలే తేల్చిచెప్పారు. ఇందులో భాగంగానే చెన్నూర్ నుంచి ఓదెలు ప్రస్థానం ముగిసింది.
మంచిర్యాలలో 14 మంది ఆశావహులు
ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చిన కేసీఆర్ ఆశావహుల ఆశలపై నీళ్లు కుమ్మరించారు. మంచిర్యాల సీటు కోసం రాష్ట్ర టీవీ, చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ పుస్కూరు రామ్మోహన్‌రావుతో పాటు 14 మంది ఆశావహులు ఉన్నారు. మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారాయణ బీసీ కార్డుతో రంగంలో నిలవగా, ఓ బట్టల వ్యాపారి, ఓ పారిశ్రామికవేత్త, కాంట్రాక్టులు చేసే మరికొందరు లైన్‌లో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకే టికెట్టు కేటాయించడంతో టికెట్లు ఆశించిన నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బేర సత్యనారాయణ చెపుతున్నారు.
కారెక్కిన ముగ్గురికి మళ్లీ చాన్స్
2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ నుంచి, కోనేరు కోనప్ప సిర్పూర్ నుంచి అనూహ్య విజయం సాధించారు. గెలిచిన వెంటనే వారు రాష్ట్రంలో బీఎస్పీనే టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి, ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నా రు. ఆ వెంటనే ఐకే రెడ్డి రాష్ట్ర మంత్రి అయ్యారు. అలాగే ఉమ్మడి జిల్లాలో కేవలం ముథోల్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు వేరే పార్టీల నుంచి గెలిచిన ముగ్గురు ఈసారి టీఆర్‌ఎస్ టికెట్టు పొందడం విశేషం.
ఎంపీ నగేష్ బోథ్ ఆశలపై నీళ్లు
టీడీపీ తరపున బోథ్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన గోడెం నగేష్ గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరి, ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా గెలిచినప్పటికీ, ఎమ్మెల్యే అయి ఉంటే మంత్రిగా అవకాశం వచ్చేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. అందుకే ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాజా టికెట్ల పంపిణీలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకే తిరిగి అవకాశం లభించడంతో నగేష్ ఆశలు గల్లంతయ్యాయి.
ఖానాపూర్‌లో రాథోడ్‌కు ఆశాభంగం
గతంలో ఖానాపూర్‌లో టీడీపీ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎం పీగా ప్రాతినిధ్యం వ హించిన రాథోడ్ రమేష్ గత సంవత్స రం టీఆర్‌ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి తానే పోటీ చేస్తున్నట్లు పార్టీలో చేరిన రోజే ప్రకటించారు. ఖానాపూర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు కూడా సీటు మార్పు ఖాయమనే భావన కల్పించా యి. అనూహ్య పరిస్థితుల్లో ఖానాపూర్ సీటు ను తిరిగి రేఖానాయక్‌కే కేటాయించడం స్థానికంగా రాథోడ్ వర్గంలో విస్మయాన్ని కల్గిం చింది. ఖానాపూర్‌లో రాథోడ్ రమేష్‌కే కాకుం డా ఆసిఫాబాద్‌లో ఆయన కుమారుడికి కూ డా సీటు వస్తుందని ప్రచారం జరిగింది. రే ఖానాయక్‌కు తిరిగి సీటు లభించడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రాథోడ్ వర్గం ఉంది.
బెల్లంపల్లిలో ప్రవీణ్‌కు నిరాశే!
బెల్లంపల్లి నియోజకవర్గంలో 2014లోనే ప్రస్తుత జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్‌కు బీఫారం దాకా వచ్చి న టికెట్టు అనూహ్యం గా నెన్నెల ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేసిన దుర్గం చిన్నయ్యకు దక్కింది. టీజేఏసీ చైర్మన్ కోదండరాం పలుకుబడితో చిన్నయ్యకు అప్పట్లో టికెట్టు లభించిందనే ప్రచారం జరిగింది. ఈసారి ఎలాగైనా బెల్లంపల్లి సీటు సాధించాలనే పట్టుదలతో ఆయన ఉన్నప్పటికీ, కేసీఆర్ తిరిగి చిన్నయ్యకే సీటును ఖరారు చేశారు. ఇటీవల బెల్లంపల్లి మున్సి పల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గించడంలో ప్రవీణ్ పాత్ర కొంత వివాదాస్పదమైంది. ఈ పరిణామాల్లో ఆయనకు టిక్కెట్టు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment