సాక్షిప్రతినిధి, కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘ముందస్తు’ షెడ్యూలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరో 60 రోజుల్లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుండగా.. ఈలోగా ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు ఆయా రాజకీయ పార్టీలు ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి మినహా అన్ని స్థానాలకూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను టీ పీసీసీ, ఏఐసీసీలకు డీసీసీ ద్వారా పంపించగా.. ఫ్లాష్ సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు జరుగుతోంది.
బీజేపీ కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. మిగతా స్థానాల్లో ఈనెల 10న అమిత్ షా పర్యటన అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కూటమి చర్చలు నేడో, రేపో కొలిక్కి రానుండగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ పోటీచేసే స్థానాలు తేలంనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఐదారు స్థానాలపై వైఎస్సార్ సీపీ గురి పెట్టింది. సీపీఎం అలయెన్స్‌తో ఉన్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ఇప్పటికే కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో విడత జాబితాపై కసరత్తు చేస్తోంది. బీఎస్పీ, ఇతర పార్టీలు కూడా పోటీపై కసరత్తు చేస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు ఈరెండు నెలల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
గులాబీ శ్రేణుల ప్రచార హోరు.. అసంతృప్తులది అదే తీరు..
సెప్టెంబర్ 6న శాసనసభ రద్దుతోపాటే రాష్ట్రంలో 105 స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటింంచిన విషయం తెలిసిందే. చొప్పదండి నియోజకవర్గం మినహా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 స్థానాలలో ‘సిట్టింగ్’లకే అవకాశం కల్పించారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో పరిస్థితి బాగానే ఉన్నా.. వేములవాడ, రామగుండం, మానకొండూరులో టికెట్ల కేటాయింపుపై నిరసనలు, ఆందోళనలు జరిగాయి. పెద్దపల్లి, మంథని, జగిత్యాలలోనూ అసంతృప్తులు నిరసన గళమెత్తారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్ చొరవతో మానకొండూరులో వివాదానికి శనివారం తెరపడింది. రామగుండం, వేములవాడలో పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పుతోంది. పెద్దపల్లి, మంథనిలో చాపకిందనీరులా అసమ్మతి రగులుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారంతో ఇప్పటికే రెండు విడతలుగా చుట్టేసిన మంత్రి ఈటల రాజేందర్.. ఆదివారం హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.
కరీంనగర్, ధర్మపురి, మానకొండూరు, సిరిసిల్ల, కోరుట్లలో ప్రచారం హోరెత్తుతోంది. మంథ ని, పెద్లపల్లి, రామగుండంలో అభ్యర్థులు ప్రచా ర ం చేస్తున్నారు. రామగుండం, వేములవాడ, జగిత్యాలలో అభ్యర్థులకు వ్యతిరేకంగా అసంతృప్తులు కూడా ప్రచారం చేస్తుండటం తలనొప్పిలా మారింది. చొప్పదండిలో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోగా.. తాజామాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. టికెట్ రేసులో ముందున్న సుంకె రవిశంకర్ ఎవరికివారుగా టీఆర్‌ఎస్ నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. మంత్రులు, తాజామాజీ ఎమ్మెల్యేలు నెలరోజులుగా గ్రామగ్రామానా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఈ నాలుగేళ్ల మూడునెలల కాలంలో నియోజకవర్గానికి ఏం చేశామనే విషయాన్ని వివరిస్తూ ముందుకెళుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసేలా కసరత్తు కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో అసంతృప్తులున్న చోట బుజ్జగింపుల పర్వం కూడా సాగుతోంది.
కాంగ్రెస్ టికెట్లకు సర్వే నివేదికలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధిష్టానం.. తాజాగా శనివారం ప్రాథమిక పరిశీలన ప్రక్రియను ముగించి టీపీసీసీకి పంపింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న కాంగ్రెస్ ఫ్లాష్ సర్వే తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోం ది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇప్పటికే నియోజకవర్గానికి మూడు నుంచి పదిమంది దరఖాస్తు చేసుకోగా.. ఒక్కోస్థానం నుంచి మూడునుంచి ఐదుగురి పేర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో ఉన్న ఆశావహులకు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ఆదరణ, గుర్తింపు ఉందనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈనెల 13లోగా ఫ్లాష్ సర్వే నిర్వహించనున్నారు. జగిత్యాల, మంథని, మానకొండూరు, హుస్నాబాద్ మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఈ సర్వే కొనసాగనుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొమ్మిదిస్థానాలకు ఈనెల 13 తర్వాత ప్రకటించే జాబితాలో అభ్యర్థులు ఖరారయే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రకటించే అవకాశముంది. జగిత్యాల, మంథని, మానకొండూరు, హుస్నాబాద్ మినహా మిగతా స్థానాలను సర్వే ఫలితాలతో పాటు కూటమి కేటాయింపుల్లో స్పష్టత ఆధారంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.
అమిత్‌షా సభ తర్వాతే బీజేపీ అభ్యర్థుల ప్రకటన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు బీజేపీ టికెట్ కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, రామగుండం, వేములవాడ మినహా మిగతా తొమ్మిది స్థానాలకు ఇద్దరు నుంచి ఐదుగురు వరకు టికెట్లు ఆశిస్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, రామగుండం, వేములవాడ అభ్యర్థులుగా గుజ్జుల రామకృష్ణారెడ్డి, బండి సంజయ్, బల్మూరి వనిత, ప్రతాప రామకృష్ణ పేర్లు లాంఛనమే కాగా, మిగిలిన తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ అభ్యర్థుల విషయంలో కూడా ఈనెల 3, 4, 5 తేదీలలో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేశారు. ఈనెల 10న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగసభను ఏర్పాటు చేశారు. అమిత్‌షాతోపాటు ఈ సభకు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు హాజరు కానున్నారు. ఈ సభ అనంతరమే అధికారికంగా బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆరుస్థానాల నుంచి వైఎస్సార్‌సీపీ... రెండో విడతకు బీఎల్‌ఎఫ్ సిద్ధం..
దివంగత నేత, డాక్టర్ వైఎస్సార్ ఆశయాల సాధన, బడుగ పేద బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ సీపీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ బలోపేతం అవుతోంది. వచ్చే ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఆరు స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపాలని అధిష్టానం యోచిస్తోంది. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్‌తోపాటు మరోమూడు స్థానాల నుంచి పోటీచేసే విషయం ఆలోచన చేస్తోంది.
కరీంనగర్, చొప్పదండి, మానకొండూరుకు డాక్టర్ కె.నగేష్, అక్కెనపల్లి కుమార్, ఎస్.అజయ్‌వర్మ పేర్లు లాంఛనమే కాగా.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని చెప్తున్నారు. కాగా సీపీఎం అలయెన్స్‌తో బహుజన వామపక్ష కూటమి (బీఎల్‌ఎఫ్) ఇప్పటికే తొలి విడతగా ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్‌కు వసీం అహ్మద్, మానకొండూరుకు మర్రి వెంకటస్వామి, చొప్పదండికి కనకం వంశీకిరణ్ పేరును ఖరారు చేశారు. రామగుండంలో సీపీఎం అభ్యర్థికి టికెట్ కేటాయించనుండగా.. మిగతా తొమ్మిది స్థానాల్లో బీఎల్‌ఎఫ్ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరుత్తు చేస్తోంది. ఈనెల 12 తేదీ వరకు మలి విడత జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment