సాక్షి, నల్లగొండ : ప్రభుత్వం జిల్లా పరిషత్ తరహా లోనే గ్రామ పంచాయతీల్లోనూ స్టాండింగ్ కమిటీలు, కోఆప్షన్లు అమలు చేస్తోంది. వాటి ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేయవచ్చన్న భావంతో ఈ సంవత్సరం అమలుకు శ్రీ కారం చుట్టింది. గ్రామాల అభివృద్ధికి ఈనెల 6 నుంచి 30 రోజుల ప్రణాళికను ప్రారంభించిం ది. అందులో భాగంగా ఈనెల 7వ తేదీన గ్రామపంచాయతీల్లో కోఆప్షన్, స్టాండింగ్ కమిటీలను ఎన్నుకోవాలని నిర్ణయించింది. అందుకు సం బంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసి జిల్లా డీపీఓ ద్వారా ఆయా ఎంపీడీఓలకు, సర్పంచ్‌లకు పంపించింది. ఈ మేరకు జిల్లాలో కమిటీల నియామకాలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి.
అందులో ఇప్పటికే 842 గ్రామపంచాయతీల్లో కోఆప్షన్‌సభ్యుల ఎంపిక పూర్తయింది. స్టాండింగ్ కమిటీలను కూడా ఎన్నుకున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ఒక్కో గ్రామపంచాయతీలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అదే విధంగా నాలుగు స్టాండింగ్ కమిటీలు, అందులో ఒక్కో స్టాండింగ్ కమిటీకి 15మంది సభ్యులు ఉంటారు.
అందులోనే ఒకరు చైర్మన్‌గా ఎన్నికవుతారు. ఈ కార్యక్రమం అంతా దాదాపు పూర్తి కావస్తోంది. అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి విషయంలో అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి కమిటీలను పూర్తి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆయా గ్రామాల్లో కమిటీలు పూర్తయ్యాయంటే ప్రస్తుతం జరిగే 30 రోజుల ప్రణాళికలో పనులన్నింటినీ గుర్తించి అదే తరహాలో గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోనున్నారు.
2 పంచాయతీల్లోనే వాయిదా పడిన ఎంపిక
జిల్లాలో మొత్తం 844 పంచాయతీలు ఉంటే 842 పంచాయతీల్లో కోఆప్షన్, స్టాండింగ్ కమి టీల ఎంపిక పూర్తయింది. కేవలం 2 పంచాయతీల్లో నిలిచిపోయింది. దేవరకొండ మండలం లో తెలుగుపల్లి గ్రామంలో కోఆప్షన్ సభ్యులు, కనగల్ మండల కేంద్రంలో కూడా కోఆప్షన్, స్టాండింగ్ కమిటీల ఎంపిక వాయిదా పడింది.
ఇప్పటికే రూ.20 కోట్ల నిధులు మంజూరు
ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.20కోట్లు మంజూరు చేసింది. నిధులు కూడా జిల్లాకు ఇప్పటికే చేరాయి. వాటన్నింటినీ జిల్లా పంచాయతీ అధికారి ఆయా గ్రామాల జనాభా ప్రాతిపదికన వారి అకౌంట్లలో జమచేసే పనిలో ఉన్నారు. పనుల గుర్తింపు అనంతరం ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ‘మన ఊరిని మనమే బాగు చేసుకుందాం. ఏ ఊరి ప్రజలు ఆఊరి కథానాయకులు కావాలి’ అన్న నినాదంతో పంచాయతీల అభివృద్ధికి తీసుకున్న 30రోజుల ప్రణాళిక విజయవంతంగా ముందుకు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment