సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థ రద్దు కానుందా? వీరిని పంచాయతీరాజ్ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందా? ఈ రకమైన సంకేతాలే కనబడుతున్నాయి. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడొచ్చని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యో గుల్లో అవినీతి పెరిగిపోయిందని, వీరిని సంస్క రించకపోతే రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అంశాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సీఎం, సీఎస్, భూ పరి పాలన ప్రధాన కమిషనర్‌కు లేని అధికారాలు వీఆర్‌ఓల కున్నాయని శాసనసభ సాక్షిగా సీఎం వ్యాఖ్యానించడం ఉద్యోగవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ రైతుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రెవెన్యూ పని పడదామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు చేస్తున్న సర్కారు.. భూ వివా దాలకు తావివ్వకుండా టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావా లని యోచిస్తోంది. ఓవైపు కొత్త చట్టంలో పొందు పరచాల్సిన అంశాలపై మల్లగుల్లాలు పడుతూనే.. పాలనాపరమైన సంస్కరణలు చేపట్టే దిశగా నిపుణుల కమిటీతో చర్చిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయిలో ఉన్న వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి.. ఉద్యోగులను పంచాయతీరాజ్ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేస్తే సరిపోతుందనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. కొందరితో అందరికీ నష్టం: వాస్తవానికి గ్రామస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా వీఆర్వోలు వ్యవహరిస్తారు. ఏ శాఖ పనిలోనైనా వీఆర్వోలే కీలక భూమిక పోషిస్తారు. అదే సమయంలో రెవెన్యూ రికార్డుల సంరక్షకుడిగా పనిచేస్తారు. అయితే, భూముల విలువలు పెరగడం.. దానికి తగ్గట్లుగానే వివాదాలు కూడా పెరగడం వీఆర్‌ఓలకు కల్పతరువుగా మారింది. రికార్డుల తారుమారు.. ఒకరికి బదులు మరొకరి పేరు, విస్తీర్ణం నమోదులోనూ అడ్డగోలుగా వ్యవహరించ డంతో దుమారం చెలరేగింది.
వీఆర్వోల వ్యవస్థ అవినీతి కేంద్ర బిందువుగా మారిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీనికితోడు వీఆర్వోలుగా పదోన్నతులు పొందిన మరికొందరు.. చట్టంపై అవగాహన లేక తప్పుల తడకగా రికార్డులు నమోదు చేయడం కూడా భూ వివాదాలకు దారితీసింది. ఈ పరిణామాలతో రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో ఒకరకమైన దురభిప్రాయం ఏర్పడిందని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికితోడు భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జరిగిన పరిణామాలు శాఖ పనితీరుపై ప్రభావం చూపాయి. సాంకేతిక సమస్యలు, మార్పు చేర్పులకు ఆప్షన్ ఇవ్వకపోవడం, రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఎడతెగని జాప్యం కారణంగా పరిస్థితి చేయిదాటింది. పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాకపోవడం.. తాతల కాలంనాడే భూములమ్ముకున్న వారి పేర్లతో పాస్ పుస్తకాలు జారీ కావడంలాంటి సంఘటనలు చోటుచేసు కున్నాయి. దీంతో ఆఖరికి భూ రికార్డుల ప్రక్షాళన లక్ష్యం కాస్తా పక్కదారి పట్టింది. ఈ పరిణామాలన్నింటిపై ఇంటెలిజెన్స్ విభాగంతో వివరాలు తెప్పించుకున్న సీఎం.. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని ఇక కఠినంగా వ్యవహరించాల్సిందేననే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల ఏసీబీ దాడుల్లోనూ వీఆర్‌ఓలే ఎక్కువగా పట్టుబడుతుండడం కూడా సీఎం ఆగ్రహానికి కారణమైంది.
డేంజర్‌జోన్‌లో వీఆర్‌ఓలు!
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 4,700 మంది వీఆర్‌ఓల భవితవ్యంపై ఈ ప్రతిపాదనలతో నీలినీడలు కమ్ముకున్నాయి. రెవెన్యూశాఖ గురించి ప్రస్తావించిన సందర్భాలలో వీఆర్‌ఓలవైపు కేసీఆర్ వేలెత్తి చూపుతుండడంతో తమ పోస్టులకు ముప్పు వాటిలినట్లుగానే ఉద్యోగవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలావుండగా, గతంలో భూ రికార్డుల ప్రక్షాళనకు ముందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, లోకేశ్ కుమార్‌లతో కూడిన కమిటీ.. గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించే వీఆర్‌ఓల వ్యవస్థను రద్దు చేయకూడదని సిఫార్సు చేసింది. అయితే, సీఎం మాత్రం రోజుకో హెచ్చరికతో వేడిపుట్టిస్తుండడంతో కొత్త రెవెన్యూ చట్టం ఎలా ఉంటుంది? వీఆర్‌ఓలు ఉంటారా? ఇతర శాఖల్లో విలీనం అవుతారా? అనే ఉత్కంఠ ఉద్యోగవర్గాల్లో నెలకొంది.
సీఎం గారూ.. ఏంటిలా?
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై వీఆర్‌ఓ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తామే తప్పుచేశామని స్వయంగా ముఖ్యమంత్రే దోషులుగా చిత్రీకరిస్తే తమ బాధలు ఎవరు చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యామని, సీఎస్, సీసీఎల్‌ఏలకు లేని అధికారాలు తమకున్నాయని సీఎం వ్యాఖ్యానించారని, తమకేం అధికారాలున్నాయో సీఎం చెప్పాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. తమను అవమానించేలా సీఎం మాట్లాడారని, 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నామని, చిరుద్యోగులైన తమపై కక్షసాధింపునకు పాల్పడడం సరైంది కాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం వ్యాఖ్యల కారణంగా ప్రజల్లో తమకు గౌరవం లేకుండా పోతుందని, సామాజిక భద్రత కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నుంచి ఈనెల 27వరకు వర్క్‌టూ రూల్ పాటిస్తున్నామని, నల్లబ్యాడ్జీలతో వీఆర్‌ఓలందరూ విధులకు హాజరవుతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment