బతుకమ్మ చీరలొచ్చాయ్‌ ! | Telangana Government Distribute Batukamma Sarees Mahabubnagar | Sakshi
Sakshi News home page

బతుకమ్మ చీరలొచ్చాయ్‌ !

Sep 7 2019 11:50 AM | Updated on Sep 7 2019 11:54 AM

Telangana Government Distribute Batukamma Sarees Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఆడపడుచుల ఇష్టమైన పండుగ బతుకమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కానుకగా అందించే చీరలు జిల్లాకు చెరుకున్నాయి. తెల్లరేషన్‌కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు సీఎం బతుకమ్మ చీరను ప్రతియేటా అందిస్తున్నారు. జిల్లాలోని జిల్లాలో 2,98,134 మంది మహిళలకు బతుకమ్మ చీరలు అందించనున్నారు. ఇప్పటికే జిల్లాకు 1.28 వేల చీరలు చేరాయి. వీటిని అధికారులు జిల్లాలోని వివిధ  గోదాంలో భద్రపరిచారు. మిగతావి వారం రోజుల్లో తీసుకరావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 28 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కొనసాగుతున్న ఆనవాయితీ.. 
రాష్ట్ర ఆవిర్భావం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టి ప్రతి ఏటా పంపిణీ కొనసాగిస్తున్నారు. అలాగే   మైనారిటీలకు వారి పండగల సందర్భంగా గిఫ్ట్‌ ప్యాక్‌లు అందించింది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత దారిద్య్రరేఖకు దిగువన జీవస్తున్న పేద వర్గాల కోసం జనతావస్త్రాల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. అప్పట్లో తెల్లరేషన్‌కార్డు ఉన్న పేదవారికి రూ. 22లకు చీర, రూ.18లకు పంచెలను పంపిణీ చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా 18 సంవత్సరాల పైబడిన పేద మహిళందరికీ బతుకమ్మ పండుగను పురష్కరించుకొని ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది.

ఈ దఫా జిల్లాలో 2,88,134 మందికి చీరలను పంపిణీచేయడానికి ఎంపిక చేశారు. సివిల్‌సప్లయ్‌ శాఖలో రేషన్‌కార్డుల ద్వారా నమోదైన లబ్ధిదారుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని అర్హులను గుర్తించారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా ఎవరైనా నమోదు చేసుకోని అర్హులైన వారుంటే వారికి సైతం చీరలు అందించేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒక చీర 5.5 మీటర్లు, జాకెట్‌ 80 సెంటీమీటర్ల చొప్పున చీరలు తయారుచేశారు. సెప్టెంబర్‌ 28 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

పూర్తయిన ప్రక్రియ 
జిల్లాలోని అన్ని మండలాల్లో 1,88,134 మంది మహిళలు, యువతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా మొదటి విడతలో జిల్లాకు 1.28 లక్షల  చీరలు వచ్చాయి. వీటిని జిల్లాలో ఉన్న చౌకధరల దుకాణాల దగ్గరలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఆడపడచులకు చీరలు అందించడంతో పాటు నేతన్నలకు ఉపాధి కల్పించే ద్విముఖ వ్యూహంతో అమలుచేస్తున్న బతుకమ్మచీరల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. 

అర్హులందరికీ అందిస్తాం 
నారాయణపేట జిల్లాలో అర్హులుగా ఉన్న మహిళలందరికీ చీ రలు అందిస్తాం. మొదటి విడతలో 75 వేల చీరలు వచ్చాయ్‌. మిగతావి వారం రోజుల్లో రావచ్చు. కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్, ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలతో చర్చించి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 
– గోవిందయ్య, జిల్లా జౌళిశాఖ అధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement