సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15తో లాక్‌డౌన్ ముగియనుంది. ఆ తరువాత?.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందున్న ప్రశ్న ఇది. లాక్‌డౌన్ ఎలా ఎత్తివేయాలి? కేంద్రం ప్రకటించినట్టు దశలవారీగా ఎత్తివేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? అనే సందేహాలు వైద్యాధికారులను వేధిస్తున్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల నుంచి వచ్చిన వారితో అనూహ్యంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి నియంత్రణలోకి వస్తుందా? వస్తే ఎప్పటిలోగా? ఇలాంటి సందేహాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఎలా గైనా లాక్‌డౌన్ ఎత్తివేయాలనే కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు కొందరు కీలక అధికారులు చెబుతున్నారు. అయితే అదెలా అన్నదే సమస్య.
హాట్‌స్పాట్ల మ్యాపింగ్‌పై దృష్టి
ఇప్పుడున్న సమాచారం ప్రకారం కరోనా ప్రభావిత హాట్‌స్పాట్లు రాష్ట్రంలో 25 ఉన్నట్లు తేల్చారు. అంటే ఈ ప్రాంతాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈనెల 10 నాటికి ఈ హాట్‌స్పాట్ల సంఖ్య మరో 25 పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. మర్కజ్ మినహా మిగిలిన కేసులు నమోదయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ఈ అంచనా నిజమైతే, 50 హాట్‌స్పాట్లను తెలంగాణలో మ్యాపింగ్ చేస్తారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను మ్యాపింగ్‌చేసి హాట్‌స్పాట్లు ప్రకటిస్తారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లాలో నిర్ణీత ప్రాంతాలను గుర్తించి హాట్‌స్పాట్లను మ్యాపింగ్ చేస్తారు. అలాగే ఏదైనా జిల్లాలోని ఒక మండలంలో కేసు నమోదైతే, దాన్ని హాట్‌స్పాట్‌గా మ్యాపింగ్ చేస్తారు. ఇలా రాష్ట్రంలో పాజిటివ్ కేసులున్న ప్రాంతాలతో హాట్‌స్పాట్‌ల మ్యాపింగ్ చేస్తారు. ఈ హాట్‌స్పాట్ల పరిధిలో ‘కంటైన్మెంట్ ప్లాన్’ను అమలుచేస్తారు. అంటే ప్రజల ఇంటింటికి వెళ్లి కరోనా లక్షణాలున్న అనుమానితులను పట్టుకుంటారు. లక్షణాలుంటే ఆసుపత్రులకు తరలిస్తారు. వైద్య పరీక్షలు చేస్తారు. పాజిటివ్ ఉంటే చికిత్స చేస్తారు. హాట్‌స్పాట్ల ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగిస్తారు.
పదో తేదీ నాటికి రానున్న స్పష్టత
ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. జనజీవనం అల్లకల్లోలమైంది. వ్యాపారాలు, సంస్థలు, దుకాణాలు, మాల్స్ మూతపడ్డాయి. ఉపాధి కరువై సాధారణ జనం అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో సేవలందక రోగులు నరకయాతన పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలన్నదే సర్కారు ఉద్దేశం. ఇప్పటివరకు మర్కజ్ నుంచి వచ్చిన వారితో 21 జిల్లాలు ప్రభావితమయ్యాయి. మిగిలిన జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అత్యధికంగా హైదరాబాద్, వరంగల్ అర్బన్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సగానికి పైగా కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి. ఇందులో మర్కజ్ నుంచి వచ్చిన కేసులే ఇప్పుడు 80శాతంపైగా ఉన్నాయి. పైగా ఇప్పటివరకు ఎక్కడా రెండో కాంటాక్ట్ దాటి మూడో వ్యక్తికి కరోనా సోకలేదనే అంచనా ఉంది. అంటే మర్కజ్ నుంచి వచ్చినవారితో కుటుంబసభ్యులు, సమీప బంధువులకు మాత్రమే కరోనా సోకింది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కూడా వారితో సన్నిహితంగా మెలిగిన వారికే వచ్చింది. అంటే వైరస్ వ్యాప్తి జనసమూహంలోకి ఇంకా వెళ్లిన జాడల్లేవు. కాబట్టి ఈనెల 10 నాటికి మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు, కుటుంబీకులకు, కాంటాక్టులకు వేలాది మందికి పరీక్షలు చేస్తారు. అప్పటివరకు కేసుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కేసులు తగ్గితే దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత!
హాట్‌స్పాట్ ప్రాంతాల మ్యాపింగ్, ఆ ప్రాంతాల ప్రజల ఇళ్లకు వెళ్లి అనుమానితులను గుర్తించడం ద్వారా ఈనెల 10 తర్వాత కేసుల సంఖ్యలోని హెచ్చుతగ్గులను అంచనా చేస్తారు. పదో తేదీ తర్వాత కేసుల సంఖ్యలో తగ్గుదల ఉంటే, 15వ తేదీ తర్వాత విడతల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశముంది. ప్రపంచంలో అనేక దేశాలు ఇదే చేస్తున్నాయి. కేసుల సంఖ్య రోజుకు ఐదారుకంటే ఎక్కువగా నమోదుకాని పరిస్థితి ఉండాలి. అప్పుడు మ్యాపింగ్ చేసిన హాట్‌స్పాట్లను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఎత్తివేస్తామని కరోనా ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు చెప్పారు. అదీ కొన్ని నిర్ణీత కార్యకలాపాల నిమిత్తమే ఎత్తివేస్తారు. అయితే కొన్నాళ్లపాటు రాత్రివేళలో కర్ఫ్యూ కొనసాగిస్తారు.
హాట్‌స్పాట్లలో మాత్రం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చాకే లాక్‌డౌన్ ఎత్తివేస్తారు. ‘హైదరాబాద్ సహా ఒకట్రెండు జిల్లాల్లో లాక్‌డౌన్ ఇప్పుడే ఎత్తివేసే పరిస్థితి లేదు. నమోదైన కేసుల్లో ఎక్కువ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మలక్‌పేట మొదలు టోలీచౌక్ వరకు కేసులు గణనీయంగా ఉన్నాయి. మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. ఇక, మిగిలిన ప్రాంతాలలో లాక్‌డౌన్ ఎత్తివేతపై ఆలోచించాల్సి ఉంటుంది’అని ఆ అధికారి వివరించారు. మొత్తానికి లాక్‌డౌన్ ఎత్తివేత ప్రక్రియపై వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. హాట్‌స్పాట్ల పరిధి ఎంతమేరకు ఉంటుంది? ఎంత దూరం వరకు మ్యాపింగ్ చేస్తారన్న దానిపై మార్గదర్శకాలను కేంద్రం ఇస్తుందని ఒక అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment