న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్-19)పై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాలు అమీతుమీ తేల్చేస్తాయని వీరు అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసులను మే నెల మొత్తం బంద్ చేయడమే మేలని స్పష్టం చేశారు. కరోనాపై పోరు కొనసాగిస్తూ రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రధాని వ్యాఖ్యానించడం తెల్సిందే. (రష్యా ప్రధానికి కరోనా)
లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఉంటాయన్న వార్తలు వస్తున్న తరుణంలో వైద్య నిపుణులు కంటైన్మెంట్ జోన్లు, గ్రీన్‌జోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనని చెబుతున్నారు. దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాలు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 129కి తగ్గాయి. ఇదే సమయంలో గ్రీన్‌జోన్లు 325 నుంచి 307కు, తగ్గిపోగా, ఆరెంజ్ జోన్లు 207 నుంచి 297కు పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వైరస్ నాశనం కాదని, వ్యాప్తిని నియంత్రించగలమన్నది గుర్తించాలని, కాబట్టి రెడ్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడం మేలని, అదే సమయంలో గ్రీన్‌జోన్లలో నియంత్రణలు ఎత్తివేసి.. రెడ్‌జోన్ల వారు అక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రి అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్ కుమార్ గుప్తా తెలిపారు. (సొంతూరికి దారేది?)
శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సర్జన్ అయిన డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థలతోపాటు మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, మతపరమైన ప్రాంతాలపై నిషేధం కొనసాగాలని సూచించారు. గ్రీన్‌జోన్ల సరిహద్దులను మూసివేయడంతోపాటు భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు తొడుక్కోవడం వంటి నిబంధనలను అక్కడ పాటించేలా చూడాలని అరవింద్ తెలిపారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో అవి తగ్గేదాకా లాక్‌డౌన్ కొనసాగాలని అన్నారు. లాక్‌డౌన్ మరో నాలుగు వారాలపాటు ఉంటే బాగుంటుందని, కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ దశలో లాక్‌డౌన్ ఎత్తివేయడం సరికాదని మ్యాక్స్ హెల్త్‌కేర్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రోమెల్ అభిప్రాయపడ్డారు. గ్రీన్‌జోన్లలో కొంత ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం కల్పించాలని అన్నారు. (ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ)
భిన్నాభిప్రాయాలు
లాక్‌డౌన్ ఎత్తివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ జనాభాలో యువత 44 శాతం ఉండడం, ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైబడి ఉండడం, క్షయ వ్యాధిని నిరోధించే బీసీజీ టీకాలు తీసుకోవడం, కరోనా వైరస్ స్ట్రెయిన్స్‌లో ఉన్న తేడాలు తదితర కారణాలతో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందన్న వాదనలు ఉన్నాయి. అందుకే భౌతిక దూరం, పారిశుద్ధ్యం చర్యల్ని పకడ్బందీగా తీసుకొని దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ మరో వాదనను వినిపిస్తోంది. భారత్ ఇప్పటివరకు వైరస్‌ని తొక్కి పట్టి ఉంచిందని, 130 కోట్ల జనాభా ఉన్న దేశం లాక్‌డౌన్ ఎత్తేస్తే వ్యాధి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు సమీర్ శరణ్ హెచ్చరించారు. ఈ వైరస్ పూర్తిస్థాయి నిర్మూలనకి ఏడాది పడుతుందని లాక్‌డౌన్ ఎత్తేసే సమయంలో కట్టుదిట్టమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment