సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కాసుల వేట సాగిస్తోంది. ఆర్థికమాంద్యంతో ఆదాయార్జన శాఖలు లక్ష్యసాధనలో చతికిలపడటంతో లోటు సర్దుబాటుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. భూముల వేలంతో నిధులను సమకూర్చుకునే దిశగా యోచిస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో భూముల ధరలు నింగినంటడంతో అసైన్డ్ భూముల అమ్మకం లేదా బడా సంస్థలకు కట్టబెట్టడం ద్వారా నిధులను సమీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, గండిపేట మండలాల పరిధిలో ఉన్న ఆరు గ్రామాల్లోని అసైన్డ్/ప్రభుత్వ భూముల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఆయా గ్రామాల పరిధిలో సర్వే నిర్వహించిన రెవెన్యూ యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో పొజిషన్‌లో ఉన్న లబ్ధిదారుల జాబితా/పరాధీనమైన అసైన్డ్ భూముల లెక్క తీసింది. ఆయా ప్రాంతాల్లోని భూముల ప్రభుత్వ విలువ, బహిరంగ మార్కెట్‌లో పలుకుతున్న ధర, భూమి సేకరిస్తే చెల్లించాల్సిన మొత్తం, ప్రభుత్వానికి చేకూరే లబ్ధిపై అంచనాలను కూడా సేకరించింది. తద్వారా ఈ భూముల అమ్మకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి.
ఖజానాకు కాసుల పంట!
సర్వే నిర్వహించిన ఆరు గ్రామాల్లోగుర్తించిన 1,636 ఎకరాలను విక్రయిస్తే రాష్ట్ర ఖజానాకు రూ.5,745 కోట్ల ఆదాయం రానుంది. మహేశ్వరం మండలం కొంగరఖర్దు, తుమ్మలూరు, రావిర్యాల, కందుకూరు మండలం మాదాపూర్, శంషాబాద్ మండలం రాయన్నగూడ పరిధిలో భూమి లేని నిరుపేదలకు అసైన్డ్ చేసిన 1,448 ఎకరాలను స్వాధీనం చేసుకొని వేలం వేస్తే ఈ మేరకు రాబడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ నిర్దేశిత భూమి విలువ (రిజిస్ట్రేషన్ వాల్యూ) రూ.276.93 కోట్లు మాత్రమే ఉండగా.. గుర్తించిన ఈ భూములను సేకరిస్తే నష్టపరిహారం రూపంలో అసైన్డ్‌దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,222.93 కోట్లుగా రెవెన్యూ శాఖ లెక్కగట్టింది. ఈ ఐదు గ్రామాల్లో ఈ భూములకు బహిరంగ మార్కెట్‌లో పలుకుతున్న ధర ఎంతో తెలుసా.. రూ.3,584.30 కోట్లు. అంటే ప్రభుత్వ ఖజానాకు లభించే ఆదాయం రూ.2,361.51 కోట్లన్న మాట. ఇలా భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నందున.. చేతులు మారిన, అసైన్డ్‌దారుల కబ్జాలో ఉన్న భూములను సేకరించడం ద్వారా ఖజానాను నింపుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా.. ఇటీవల హైదరాబాద్‌కు బహుళ జాతి సంస్థలు, ఐటీ కంపెనీల పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ల్యాండ్ బ్యాంక్‌పై కసరత్తు చేస్తున్న సర్కార్.. నగరానికి చేరువలో ఉన్న ప్రభుత్వ భూ లభ్యతపై లెక్క తీస్తోంది. ఇందులో భాగంగా అసైన్డ్ భూములను సేకరించాలని యోచిస్తోంది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం అసైన్డ్, ప్రభుత్వ, ప్రైవేటు భూముల లెక్క తేలింది. పరాధీనమైన అసైన్డ్ భూములు, ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించే దిశగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం.. అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంది. పట్టా భూముల సేకరణ వ్యయంతో కూడుకున్నదే గాకుండా న్యాయపరమైన చిక్కులు కూడా తలెత్తుండటంతో అసైన్డ్ భూములపై ప్రభుత్వం కన్నేసింది. ఈ భూములను వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుకుగాను బడా సంస్థలకు కేటాయించడం లేదా వేలం వేయడం ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకోవడమో చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ భూముల లెక్క తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
188 ఎకరాలు.. రూ.3,384 కోట్లు
గండిపేట మండలం పుప్పాల్‌గూడ. ఇది ఐటీ హబ్‌కు కూతవేటు దూరంలో ఉన్న గ్రామం. బడా సంస్థల రాకతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ గ్రామంలో 188 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ తాజా సర్వేలో తేల్చింది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ రూ.3,384 కోట్ల మేర ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో గుర్తించిన ఆరు గ్రామాల్లో 1,636 ఎకరాలను అమ్మడం ద్వారా రూ.5,745 కోట్ల మేర రాబట్టవచ్చని ఆశిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment