హామీలు అమలు చేయకుంటే ఊరుకోం: డీఎస్
నిజామాబాద్: తెలంగాణ ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే ఎండగడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పోరాటాలతోనే తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే విధంగా హమీలు ఇవ్వటంతోనే ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారన్నారు. వాటిని నెరవేర్చటంలో కేసీఆర్ విఫలం అయితే, తాము ఊరుకోబోమన్నారు.
తెలంగాణ వాదం ప్రతి ఒక్కరి హృదయంలోకి వెళ్లిందని, అదే కాంగ్రెస్ పార్టీ ఓడిమికి కారణం అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ ఆయన ప్రయత్నం ఆయన చేశారన్నారు. వాస్తవంగా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయేనని, దానిని మనం ప్రజల్లోకి తీసుకుపోవటంతో విఫలయమయ్యామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీఎస్ పిలుపునిచ్చారు.