దసరా పండుగ పింఛన్ సంబరాలు తెస్తుందనుకున్న ఆశ అడియాసే అయింది. దీపావళి వెలుగులు పింఛన్ రూపంలో వచ్చేది కలే అయింది. నవంబర్ పోయింది.
కళ్లు కనిపించవు.. పింఛన్ రాదు!
దసరా పండుగ పింఛన్ సంబరాలు తెస్తుందనుకున్న ఆశ అడియాసే అయింది. దీపావళి వెలుగులు పింఛన్ రూపంలో వచ్చేది కలే అయింది. నవంబర్ పోయింది. డిసెంబర్ వచ్చింది. కానీ పింఛన్ జాడ మాత్రం కానరాకుండా పోయింది. పెరిగిన పింఛన్ వస్తదనుకుంటే ఉన్న పింఛన్ ఆగిపోయిందని బాధితులు పడుతున్న ఆందోళన వర్ణణాతీతం. అసలు తమకు పింఛన్ వస్తుందో రాదోనన్న ఆవేదన నిత్యం వారిని కుదిపేస్తుంది. అలాంటి కొందరి దీనగాథలివీ..
చెన్నూర్ రూరల్ : కళ్లు కనబడని భర్తకు అన్ని తానైంది. కూలీ పని చేసుకుంటూ భర్తను, పిల్లలను పోషించుకుంటోంది. వివరాలిలా ఉన్నాయి. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి జగన్నాథుల పెద్ద కొండయ్యకు చిన్నతనం నుంచే రెండు కళ్లు కనబడవు. అతడి భార్య ఓదమ్మ భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఎరుకుల కులానికి చెందిన వీరి ప్రధాన వృత్తి పందుల పెంపకం, బుట్టలు అల్లడం. కానీ కొండయ్యకు కళ్లు కనబడకపోవడంతో వారు ఆ వృత్తికి దూరమయ్యారు.
వీరు తలదాచుకునేందుకు సరైన ఇళ్లు కూడా లేదు. గ్రామంలోనే చిన్న పూరిగుడిసె వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొండయ్యకు కళ్లు కనబడక పోవడంతో భార్య ఓదమ్మ అన్ని సపర్యలూ చేస్తోంది. ఓదమ్మ కూలీ పనులకు వెళ్తూ, ఇంటి దగ్గర ఈత కొమ్మలతో బుట్టలు అల్లి భర్త, పిల్లలను పోషించుకుంటోంది. భర్తను ఎటైనా తీసుకు వెళ్లాలంటే ఓదమ్మ తోడు ఉండాల్సిందే. అంధుడైన భర్తను కర్ర సహాయంతో తీసుకెళ్తుంది.
ఉన్న ఆసరా పోయింది
కొండయ్యకు గతంలో ప్రభుత్వం వికలాంగుల కోటా కింద రూ.500 పింఛను ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆ పింఛను కూడా రావడం లేదు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. తాను పనికి వెళ్లని రోజు తన భర్త, పిల్లలు పస్తులుండాల్సిందేనని ఓదమ్మ కన్నీటి పర్యమంతమైంది. ఇక తన భర్తను ఎక్కడకు తీసుకుపోయి వికలాంగుల సర్టిఫికెట్ తెచ్చేదని ఆమె కంట తడి పెట్టింది. తన భర్తకు సర్టిఫికెట్ ఇప్పిస్తే పింఛన్ వస్తుందని, ఇంత ఆసరాగా ఉంటుందని ఆమె వేడుకుంటోంది. ఎవరైనా ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని కొండయ్య, ఓదమ్మలు కోరుతున్నారు.