తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 7 నుంచి అవగాహన వారోత్సవాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నవంబర్ 7 నుంచి ఏడు రోజులపాటు జరిగే కేన్సర్ అవగాహన వారోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. అదేరోజు రాష్ట్రంలోని 436 మండల కేంద్రాల్లో రొమ్ము కేన్సర్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఏర్పాట్లు చేస్తోంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలకు బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
800 మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ..
18 వేల గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తల ద్వారా మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన సుమారు 800 మంది అరోగ్య కార్యకర్తలకు నవంబర్ 2న హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. దృశ్య, శ్రవ ణ సాధనాల(ఆడియో, వీడియో సీడీల)తో ఆరోగ్య స్పృహ, కేన్సర్‌ను తొలిదశలో గుర్తించడం గురించి నిపుణులు వివరిస్తారు. అంతేకాకుండా కేన్సర్ తొలిదశను నిర్ధారించేందుకు క్లినికల్ టెస్ట్ ఎలా చేయాలో కూడా వీరికి నేర్పిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న ఆరోగ్య కార్యకర్తలు ముగ్గురు చొప్పున బృందాలుగా ఏర్పడి, మహిళలకు కేన్సర్‌పై అవగాహన కల్పించడంతోపాటు అవసరమైనవారికి క్లినికల్ టెస్ట్‌లు కూడా చేస్తారు. క్లినికల్ టెస్ట్ ద్వారా రొమ్ములో ఏవైనా గడ్డలు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆపై పరీక్షలు, వైద్య చికిత్సల నిమిత్తం ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తారు.
కేన్సర్‌పై సర్కార్ ప్రచారం!
Published Sat, Oct 18 2014 2:21 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement