సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకవైపు డెంగీ డేంజర్ కొనసాగుతుండగా, మరోవైపు స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. కాస్త దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం వస్తేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 60, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్ ఆసుపత్రుల్లో 30 పడకల చొప్పున ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. కింగ్‌కోఠి ఆసుపత్రి 10, మలక్‌పేట ఏరియా ఆసుపత్రి 3, నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో 4 పడకల చొప్పున ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. ప్రతిజిల్లా ఆసుపత్రుల్లోనూ 10 పడకల చొప్పున ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. స్వైన్‌ఫ్లూ నివారణకు అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.
1.70 లక్షల స్వైన్‌ఫ్లూ క్యాప్సిల్స్
ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 2 వేల స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 25 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. స్వైన్‌ఫ్లూకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే, 040–24651119 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 8 మంది వైద్యాధికారులతో రాష్ట్రస్థాయి నోడల్ టీంను ఏర్పాటు చేసింది. జిల్లాల్లో ప్రతి స్వైన్‌ఫ్లూ కేసుపై సమగ్రమైన వివరాలను పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులను గుర్తించేందుకు ఐపీఎం, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కేవలం ఒకేచోట మాత్రమే నిర్ధారణ పరీక్షలు జరిగేవి.
ఇప్పుడు రోజుకు వెయ్యి శాంపిళ్లను పరీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్వైన్‌ఫ్లూ రోగుల కోసం 1.70 లక్షల క్యాప్సిల్స్‌ను ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. 5,458 సిరప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోగులకు వైద్యం చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కోసం 13,750 వ్యాక్సిన్లు జిల్లాలకు పంపిణీ చేశారు. 15 వేల మాస్‌్కలు, 7,500 శానిటైజర్లు పంపించారు. 4,635 పీపీఈ కిట్లను జిల్లాలకు పంపించాలని నిర్ణయించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక స్వైన్‌ఫ్లూ విజృంభించే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు.
స్వైన్‌ఫ్లూ లక్షణాలు
- తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, తల, ఒళ్లు నొప్పులు ఉంటాయి.
- పిల్లల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురువుతుంది. ఒక్కోసారి చర్మం నీలం లేదా బూడిద రంగులోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాంతులు అవుతాయి. ఒక్కోసారి నడవడమూ కష్టంగా ఉంటుంది.
- పెద్దల్లోనైతే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీ, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment