
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ, మండలిలో తమ సభ్యుల విలీనంపై కాంగ్రెస్ గతంలో దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు చర్యలు చేపట్టింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అధిపతిగా వ్యవహరించే శాసనసభ స్పీకర్‌కు, అదే హోదాలో మండలి చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలు, 10 మంది ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీ, మండలి కార్యదర్శులు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలిలో కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన వ్యాజ్యం ధర్మాసనం ఎదుట మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది.
మండలిలో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు పార్టీ ఫిరాయించగా ఎలాంటి అధికారాలు లేకపోయినా మండలి చైర్మన్ కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లుగా ప్రకటించారని షబ్బీర్ అలీ రిట్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు రాగానే మండలి చైర్మన్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు స్పందిస్తూ సుప్రీంకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదించేందుకు వస్తారని, ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నందున విచారణను వచ్చే నెలకు వాయిదా వేయాలని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అభ్యంతరం చెప్పారు. నిన్న, ఈరోజు కూడా హరేన్ రావల్ రాష్ట్ర హైకోర్టులోనే కేసులు వాదించారని చెప్పారు. అయితే ఆయన అమెరికా వెళ్లబోతున్నారని మాత్రమే చెప్పానని రామచంద్రరావు ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. కేసుల్ని వాయిదా వేయాలని మీరే కోరుతున్నారని ధర్మాసనం పేర్కొనగా తానేమీ వాయిదాలు కోరలేదని జంధ్యాల బదులిచ్చారు. దీంతో ధర్మాసనం పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే మండలి చైర్మన్, మండలి సెక్రటరీ, పార్టీ పిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్‌రావు, కె. దామోదర్‌రెడ్డి, టి. సంతోష్ కుమార్, ఆకుల లలితకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.
అసెంబ్లీలో సీఎల్పీ కేసులోనూ..
శాసనసభలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని (సీఎల్పీ) టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే కౌన్సిల్‌లో చేశారంటూ ఏప్రిల్ 29న దాఖలైన మరో రిట్ పిటిషన్‌ను కూడా ధర్మాసనం విచారించింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారని, సీఎల్పీని సైతం టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని (అప్పటికి విలీనం నిర్ణయం తీసుకోలేదు) టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే శాసనసభ స్పీకర్, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శితోపాటు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డి. సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బీరం హర్షవర్దన్‌రెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె. సురేందర్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని రెండు కేసుల్లోనూ ధర్మాసనం ఆదేశించింది. కేసుల విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సీఎల్పీ విలీనంపై తాజా వ్యాజ్యంలో..
కాంగ్రెస్ నుంచి తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించాక సీఎల్పీ టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమైనట్లు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీ బులిటెన్ విడుదల చేసింది. అయితే పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్ నిర్ణయాన్ని, శాసనసభ కార్యదర్శి ఇచ్చిన బులిటెన్‌ను రద్దు చేయాలని ఉత్తమ్, భట్టి రెండు రోజుల క్రితం మరో రిట్ దాఖలు చేశారు. నేటి విచారణ జాబితాలో కేసు లేకపోవడాన్ని పిటిషనర్ న్యాయవాది చెప్పడంతో బుధవారం విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన చట్టసభ్యుల్లో మూడింట రెండొంతుల మంది టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమైనట్లుగా ప్రకటించే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు లేదని, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో అనర్హత అంశంపై మాత్రమే స్పీకర్ తీర్పు చెప్పవచ్చునని, విలీన అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ల వాదన. శాసనసభాపతి వేరు, పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్ వేరని, ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేయవచ్చునని వారు వాదిస్తున్నారు.
శాసనమండలి, శాసనసభల్లోని ఒక పార్టీకి చెందిన చట్ట సభ్యులను కలిపితేనే ఆ పార్టీ శాసనసభాపక్షం అవుతుందని, అంటే మండలిలో ఆరుగురు, శాసనసభలో 19 మంది చొప్పున (అప్పటికి ఉత్తమ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు) కాంగ్రెస్ సభ్యులు ఉన్నారని, పాతిక మంది ఉన్న వారిలో 19 మంది పార్టీ వీడినప్పుడే విలీనానికి చట్టపరమైన అవకాశం ఉంటుందని కూడా పిటిషనర్ల వాదన. అయితే మండలిలో ఆరుగురులో నలుగురు, అసెంబ్లీకి ఉత్తమ్ రాజీనామా చేశాక మిగిలిన 18 మందిలో 12 మంది పార్టీకి గుడ్‌బై చెప్పాక ఆ సభ్యుల బలం మూడింట రెండు వంతులేనని అధికార టీఆర్‌ఎస్ చేస్తున్న వాదనను పిటిషనర్లు తప్పుపడుతున్నారు. మరోవైపు రాజ్యాంగ నిబంధనలకు లోబడే మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌లు వ్యవహరించారని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు గట్టిగా వాదిస్తున్నారు. కాగా, ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిలను అనర్హులుగా ప్రకటిస్తూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ దాఖలైన మరో వ్యాజ్యం కూడా హైకోర్టు విచారణలో ఉన్న విషయం విదితమే. ఈ మూడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని ఈసీ హామీ ఇవ్వడంతో అందుకు అనుగుణంగా ఇటీవలే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment