హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. సోమవారం జర్నలిస్టు సంఘాల నేతలు సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి అధికారులతో తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులకు సంబంధించి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అక్రెడిటేషన్‌లకు సంబంధించి ఈనెల 24న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ సమావేశమవుతుందన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా అక్రెడిటేషన్ల కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య భీమా కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన వారికి వెంటనే అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఆరోగ్యభీమా వర్తింపచేయాలని, జస్టిస్ గురుభక్ష్ నివేదిక ప్రకారం వేతన సవరణ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనే డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా.కెవీ రమాణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌర సంబంధాల కమిషనర్ బీపీ ఆచార్య, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌చంద, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, రాష్ట్ర సమాచారశాఖ డెరైక్టర్ వి.సుభాష్ లతో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా : మంత్రి కేటీఆర్
Published Mon, Jun 22 2015 8:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement